ఉర్దూ కాలేజీలో అడ్మిషన్లు
కర్నూలు సిటీ: ఏపీ ఉర్దూ గురుకుల కాలేజీ (బాలురు) ప్రవేశాలకు దరఖాస్తూలు ఆహ్వానిస్తున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.బుబాసిర్ బేగమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉర్దూ మాతృభాష గల మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, ఈ నెల 31వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా https://aprs. apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. ఇంటర్మీడియెట్ అడ్మిషన్ల కోసం వచ్చే నెల 24వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. కాలేజీలో ఉర్దూ మీడియంతో పాటు, ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీ, బైపీ సీ, సీఈసీ గ్రూప్‌లు ఉన్నాయని వెల్లడించారు.
భక్తిశ్రద్ధలతో రోజా దర్గా ఉరుసు
కర్నూలు కల్చరల్: రోజా దర్గా ఉరుసు శనివారం ఘనంగా జరిగింది. కర్నూలు నగరం తుంగభద్ర నది ఒడ్డున వెలసిన సయ్యద్ షా ఇషాఖి సనావుల్లా ఖాద్రి (రోజా) దర్గాకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వచ్చి దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా దాదా బాషా ఖాద్రీ చర్యలు తీసుకున్నారు. దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉరుసు సందర్భంగా శనివారం రాత్రి ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖలు దర్గాను దర్శించుకున్నారు. నేడు ప్రత్యేక జియారత్ ఫాతెహాలతో ఉత్సవాలు ముగుస్తాయని పీఠాధిపతి తెలిపారు.
పాడి పశువులకు టీకాలు
కర్నూలు(అగ్రికల్చర్): పశువుల్లో గాలికుంటు, బ్రూసెల్లోసిస్ వ్యాధుల నివారణకు ఈనెల 30 వరకు టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువ్యాది నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్ రవిబాబు తెలిపారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీకాల కార్యక్రమం మొదలైందన్నారు.
వేధింపులు తాళలేక
వివాహిత ఆత్మహత్య
నందవరం: వరకట్నం తేవాలని భర్త, అత్తింటివారు వేధిస్తుండటంతో భరించలేక స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఆశీర్వాదమ్మ (26) శనివారం వేకువజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆశీర్వాదమ్మ, మాదన్న ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. రెండేళ్లుగా కాపురం అనోన్యంగా సాగింది. ఈ క్రమంలో గత ఆరు నెలల నుంచి వరకట్నం తేవాలని అత్తింటివారు వేధిస్తున్నారు. భర్త మాదన్న, అత్తమామలు మరియమ్మ, యేసన్న, బావవదినలు చంద్రశేఖర్, చిన్నారి ఆమెను కట్నం తేవాలని చిత్రహింసలు పెట్టారు. ఈ విషయమై శుక్రవారం ఆశీర్వాదమ్మ, భర్త మాదన్న మధ్య గొడవ జరిగింది. దీంతో విరక్తిచెందిన ఆశీర్వాదమ్మ ఇంట్లో ఇనుప రాడ్డుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృత్యురాలి తల్లిదండ్రులు నరసన్న, మాణికమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment