రూ.5 లక్షల వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ
కర్నూలు(అగ్రికల్చర్): ఏడాదిలోపు చెల్లించే వ్యవసాయ రుణాలపై 7 శాతం వడ్డీరేటు ఉందని, గడువులోపు చెల్లించిన రైతులకు 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం ఇస్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. వడ్డీ రాయితీ ఇప్పటి వరకు రూ.3లక్షల వరకు మాత్రం ఉందని, ఇక నుంచి రూ.5 లక్షల వరకు లభిస్తుందన్నారు. శనివారం న్యూఢిల్లీ నుంచి వెబ్‌నార్‌లో ప్రధాని మాట్లాడారు. కర్నూలు ఉద్యానభవన్‌లో జరిగిన వెబ్‌నార్‌కు రైతులు, అధికారులు హాజరయ్యారు. వెబ్‌నార్‌లో ప్రధాని మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం లక్ష్యంగా కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) ద్వారా వ్యవసాయ రుణ వడ్డీ రాయితీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామన్నారు. వ్యవసాయంపై మరింత నమ్మకాన్ని పెంచేందుకు కేసీసీ దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్‌డీఎం రామచంద్రరావు మాట్లాడుతూ... కర్నూలు జిల్లాలో డిసెంబరు నాటికి కేసీసీ కింద 4.04 లక్షల మంది రైతులకు రూ.6,985 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు పొందేందుకు కేసీసీ పనికొస్తుందన్నారు. పాడి రైతులు, చేపల పెంపకం చేపట్టిన వారందరూ కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రుణాలు పొందవచ్చన్నారు. బ్యాంకుల నుంచి తీసుకునే కేసీసీ రుణాలపై రూ.5 లక్షల వరకు వడ్డీ రాయితీ ఉన్న విషయాన్ని రైతుల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేది ప్రధాని లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, వ్యవసాయ అనుబంద శాఖల అధికారులు, వివిద బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ
Comments
Please login to add a commentAdd a comment