ఆమెకు ‘రక్షణ’ కవచం
హెల్ప్‌లైన్లు నంబర్లు
చైల్డ్ హెల్ప్‌లైన్ 1098
ఉమెన్ హెల్ప్‌లైన్ 181
పోలీస్ హెల్ప్‌లైన్ 100/112
సైబర్ క్రైం హెల్ప్‌లైన్ 1930
పోలీస్ కంట్రోల్ రూమ్
వాట్సాప్ నెంబర్ 77778 77722
కర్నూలు: సమాజంలో మహిళలు, విద్యార్థినులపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి రక్షణ కవచంలా నిలిచేందుకు జిల్లా పోలీసులు కదిలారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మహిళల రక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాలపై పోలీస్ స్టేషన్ల వారీగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓపెన్ హౌస్, మహిళా చట్టాలపై అవగాహన ర్యాలీలు, మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. ఈ తరహా కార్యక్రమాలను ఈనెల 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. మహిళలకు సంబంధించిన అంశాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజు 8వ తేదీ మహిళలతో ప్రదర్శనలు నిర్వహించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
వ్యాసరచన పోటీలు...
మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై అవగాహన కార్యక్రమాలతో పాటు సోమవారం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కర్నూలులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల, అశోక్ ఉమెన్స్, కేవీఆర్ కళాశాలలో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో కూడా వ్యాసరచన పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సందర్శించండి... తెలుసుకోండి
మహిళలు, యువతులు, విద్యార్థినులను పోలీస్ స్టేషన్లకు ఆహ్వానిస్తున్నారు. పోలీసు విధులు, మహిళా సహాయక కేంద్రం పనితీరు, అధికారుల పనితీరు, విధి నిర్వహణలో ఉపయోగించే పరిక రాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. మహిళలు, యువతులు, చిన్నారుల రక్షణకు రూపొందించి అమలు చేస్తున్న చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టాలతో పాటు సామాజిక మాధ్యమాల వినియోగం–దుష్పరిణామాలు, సైబర్ నేరాలు–తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై వివరిస్తున్నారు. బాలికలు స్వీయరక్షణ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.
సహాయానికి ఫోన్ చేయండి
మహిళలు, విద్యార్థినులు, చిన్నారులు ఎక్కడైనా, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటే తక్షణ సహాయం కోసం పోలీసులతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
మహిళల భద్రతకు పోలీసులు
జిల్లా అంతటా అవగాహన
కార్యక్రమాలు
Comments
Please login to add a commentAdd a comment