సమస్తం నిర్లక్ష్యం.. అంతటా వైఫల్యం | - | Sakshi
Sakshi News home page

సమస్తం నిర్లక్ష్యం.. అంతటా వైఫల్యం

Published Tue, Mar 4 2025 12:56 AM | Last Updated on Tue, Mar 4 2025 12:54 AM

సమస్త

సమస్తం నిర్లక్ష్యం.. అంతటా వైఫల్యం

శ్రీగిరిలో జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణలో దేవస్థాన యంత్రాంగం వైఫల్యం చెందిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్సవాల విజయవంతానికి మూడు నెలల ముందు నుంచే సమీక్షలు, సమావేశాలు అంటూ హడావుడి చేసిన అధికారులు చివరకు భక్తులకు సౌకర్యాల కల్పనలో చేతులెత్తేశారు. శ్రీశైల క్షేత్రంలో గత నెల 19 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి. 11 రోజుల పాటు సాగిన ఉత్సవాల్లో అధికారుల నిర్లక్ష్యం దర్శనమిచ్చింది. భక్తులను అతిథులుగా భావించి సౌక ర్యాలు కల్పిస్తామని చెప్పి చివరకు కష్టాల పాలు జేశా రు. మరో వైపు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. దాదాపు 6.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ మేరకు ముందస్తు ప్రణాళిక రూపొందించిన అధికారులు అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇప్పటికై న దేవస్థాన అధికారులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చోటుచేసుకున్న లోపాలపై సమీక్షించుకుని, ఈ నెలాఖరులో జరిగే ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని భక్తులు కోరుతున్నారు. – శ్రీశైలంటెంపుల్‌

మల్లన్న భక్తుల కష్టాలు ఇలా..

● చంద్రావతి కల్యాణ మండపంలో శివదీక్ష భక్తులకు అల్పాహారం, తాగునీరు అందించడంలో అధికారులు విఫలమయ్యారు. క్యూలైన్‌ ఏర్పాటులో నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది.

● జ్యోతిర్ముడి సమర్పించే క్రమంలో అర్చకులు శివదీక్ష రూ.100 ముక్కుపిండి వసూలు చేశారు.

● నందిమండపం, గంగాధర మండపం, సాక్షిగణపతి ఆలయాల వద్ద కొబ్బరికాయ కొట్టేందుకు రూ.10 వసూలు చేశారు.

● తలనీలాలు సమర్పించిన భక్తుల నుంచి టికెట్టు కాకుండా వంద రూపాయాలు అదనంగా వసూలు చేశారు.

● శ్రీశైలంలో లీటర్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించడంతో లీటర్‌ నీళ్ల సీసా రూ.60 వెచ్చించాల్సి వచ్చింది.

● కొన్ని ఆర్టీసీ బస్సులు అధిక చార్జీల పేరుతో అదనంగా వసూలు చేశారు.

● పలు హోటల్‌ నిర్వాహకులు ఆహార పదార్థాలపై ఇష్టానుసారంగా ధరలను పెంచి భక్తులను దోచుకున్నారు.

● ఫోన్‌ సిగ్నల్‌ సమస్య భక్తులకు వేధించింది. నెట్‌వర్క్‌ పనిచేయకపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు.

● క్షేత్ర పరిధిలో ‘మే ఐ హెల్ప్‌ యూ’ సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసినటప్పటికీ అక్కడ సిబ్బంది లేకపోవడంతో అవి నామమాత్రంగా పని చేశాయి.

● సమాచార బోర్డులు సైతం తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడంతో భక్తులు తికమక పడ్డారు.

● దర్శన కంపార్ట్‌మెంట్లలో అధికసంఖ్యలో ఫ్యాన్లు లేకపోవడం, భక్తులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు లేకపోవడం, రేకులషెడ్డు కావడంతో గంటల తరబడి ఉక్కపోతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

● లగేజ్‌ భద్రపరిచేందుకు నిర్ణీత రుసుం కంటే అధికంగా వసూలు చేశారు.

ఉచిత ప్రసాదం చిక్కిపోయింది

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 24 నుంచి 27వ తేదీ వరకు నాలుగు రోజుల్లో దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం అందజేస్తామని మంత్రులు గొప్పలు చెప్పారు. సాధారణంగా దేవస్థానం భక్తులకు 100 గ్రాములు లడ్డూ రూ.20కు విక్రయిస్తారు. అదే పరిమాణం ఉన్న లడ్డూను ఉచితంగా ఇస్తారని భక్తులు భావించారు. అయితే 50 గ్రాముల లడ్డూను మాత్రమే ఉచితంగా అందజేశారు. సాధారణ రోజుల్లో స్వామి ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, 20 గ్రాముల లడ్డూ, గుగ్గులు, పొంగలి ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి భక్తులకు ఉచితంగా అందజేస్తారు. అయితే బ్రహ్మోత్సవాల్లో వంద గ్రాముల లడ్డూ ఉచితంగా పంపిణీ చేసి బాగుండేదని పలువురు భక్తులు చర్చించుకున్నారు.

పేలవంగా కళా ప్రదర్శనలు..

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో క్షేత్ర పరిధిలో మూడు చోట్ల పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అవి భక్తులను అలరించలేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో సినీ ప్రముఖులు, నేపథ్య గాయకులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులతో కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది నామమాత్రంగానే జరిగాయనే విమర్శలు ఉన్నాయి. అలాగే మొదటి రెండు రోజులు సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను సకాలంలో మీడియాకు సైతం అందించలేకపోవడం గమనార్హం. పాగాలంకరణ సమయంలో పేలవంగా ప్రవచనాలు వినిపించారనే విమర్శలు ఉన్నాయి. పరమ పవిత్ర కార్యక్రమమైన పాగాలంకరణ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకం సమయంలో అధ్యాత్మికతో భక్తులు శివనామస్మరణ చేసే సమయంలో, దేవదాయశాఖ ఆర్జేసీ ప్రభుత్వ పథకాల గురించి వివరించడం అనేక విమర్శలు దారితీసింది. బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లలో నిర్లక్ష్యం, పాగాలంకరణ సమయంలో పేలవంగా ప్రవచనాలు వినిపించడం, తదితర విషయాలపై శివరాత్రి అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అధికారులతో సమావేశమై హెచ్చరించినట్లు సమాచారం.

కొరవడిన సమన్వయం

దేవస్థానం అధికారులు, ఉత్సవాల విధులకు వచ్చిన అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం రోజున బందోబస్త్‌కు వచ్చిన పోలీసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనాలు చేసుకునేందుకు ఆరాటపడ్డారు. బ్రహ్మోత్సవాల కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులను, దేవస్థాన సిబ్బందిని సైతం అడ్డుకుని అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు ఉన్నాయి. దేవస్థాన అధికారులుకు, పోలీసుల మధ్య సమన్వయం లేక గేట్లు తెరవడంతో పాగాలంకరణ అనంతరం దర్శనానికి వెళ్లేందుకు జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఎమ్మెల్యే దంపతులు భక్తుల రద్దీతో ఇబ్బందులు పడ్డారు. బ్రహ్మోత్సవాల ముందు రోజు దేవస్థానం అధికారులు, ఏసీఎస్‌పీడీసీఎల్‌ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యుత్‌లైన్లు మారుస్తున్న కార్మికుడు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. అలాగే బ్రహ్మోత్సవాల్లో డ్యాం దిగువన సున్నిపెంటలోని పాతాళగంగలో పుణ్యస్నానికి వెళ్లి తండ్రి, కుమారుడు మృత్యువాత పడ్డారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో

అధికారుల నిర్లక్ష్యం

అడుగడుగునా మల్లన్న భక్తుల

నిలువు దోపిడీ

అసౌకర్యాల నడుమ స్వామి దర్శనం

No comments yet. Be the first to comment!
Add a comment
సమస్తం నిర్లక్ష్యం.. అంతటా వైఫల్యం1
1/1

సమస్తం నిర్లక్ష్యం.. అంతటా వైఫల్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement