వేతనాలు ఎగ్గొట్టి.. కూలీల కడుపుకొట్టి! | - | Sakshi
Sakshi News home page

వేతనాలు ఎగ్గొట్టి.. కూలీల కడుపుకొట్టి!

Published Wed, Mar 5 2025 1:40 AM | Last Updated on Wed, Mar 5 2025 1:38 AM

వేతనాలు ఎగ్గొట్టి.. కూలీల కడుపుకొట్టి!

వేతనాలు ఎగ్గొట్టి.. కూలీల కడుపుకొట్టి!

కర్నూలు(అగ్రికల్చర్‌): అడిగిన వారందరికీ ఉపాధి కల్పిస్తామని చెబుతున్న అధికారులు వేతనాల చెల్లింపుల విషయంలో నోరు మెదపని పరిస్థితి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారుల మాటలు నమ్మి రెక్కలు ముక్కలు చేసుకున్న కూలీలు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు. రోజులు, వారాలు.. నెలలు గడుస్తున్నా వేతనాలు దక్కకపోవడంతో కూలీలు దిక్కుతోచని స్థితిలో వలస బాట పడుతున్నారు. జనవరి 13 తర్వాత నుంచి ఎలాంటి చెల్లింపులు చేయకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కారణంగా మహాశివరాత్రి, తిరుణాలను కూడా చేసుకోలేకపోయినట్లు ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, పెద్దకడుబూరు, హాలహర్వి, ఆలూరు, ఆదోని, కోసిగి, దేవనకొండ, హొలగొంద, ఆస్పరి, నంద్యాల జిల్లాలోని డోన్‌, ప్యాపిలి, ఆదోని తదితర మండలాలకు ఉపాధి పనులే ఆధారం. జనవరి రెండవ వారం నుంచి ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు ఒక్క రూపాయి వేతనం కూడా చెల్లించిన దాఖలాలు లేవు. కర్నూలు జిల్లాలో ఉపాధి కూలీలకు దాదాపు రూ.25 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.21 కోట్ల మేర బకాయిలు ఉండటం గమానార్హం. ఉమ్మడి జిల్లాలో లేబర్‌ కాంపోనెంటు కింద రూ.84 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన బకాయిలే దాదాపు 75 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో డోన్‌ నియోజక వర్గంలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి పనులే ఆధారం. వ్యవసాయ పనులు లేని సమయంలో వారాల తరబడి వేతనాలు లేకపోవడంతో బతుకు భారమై కూలీలు వలస బాట పడుతున్నారు.

పడిపోతున్న కూలీల హాజరు

ప్రస్తుతం రోజుకు కర్నూలు జిల్లాలో లక్ష మందికి పని దినాలు కల్పించాలనేది లక్ష్యం. కానీ రోజుకు 50వేల మంది కూడా ఉపాధి పనులకు హాజరు కాని పరిస్థితి. దొంగ మస్టర్లు వేస్తుండటం వల్ల ఈ సంఖ్య కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల జిల్లాలో హాజరు మరింత దయనీయంగా మారింది. జనవరి నుంచి ఉపాధి పనులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. కూలీలకు వారం వారం వేతనాలు చెల్లిస్తేనే హాజరు కూడా మెరుగవుతుంది. బకాయిలు భారీగా ఉండటంతో వేతనాలు ఇవ్వని ఉపాధి పనులు మాకొద్దు అనే పరిస్థితి ఏర్పడింది.

మెటీరియల్‌ పనులకు పేమెంట్లు బంద్‌

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ కార్యకర్తల కోసం ఉపాధి నిధులతో సీసీ రోడ్లు, పశువుల షెడ్లు నిర్మిస్తోంది. కర్నూలు జిల్లాలో సీసీ రోడ్లు 900 మంజూరు కాగా 825 పూర్తయ్యాయి. పశువుల షెడ్లు 950 మంజూరు కాగా 630 పూర్తి చేశారు. జనవరి 13 నుంచి మెటీరియల్‌ పనులకు కూడా పేమెంట్లు నిలిచిపోయాయి. మెటీరియల్‌ కింద కర్నూలు జిల్లాలో రూ.46 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.38 కోట్ల బకాయి ఉంది. ఉపాధి కూలీల వేతనాలకు కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను ఉపాధి కూలీలకు చెల్లించకుండా ఇతర అవసరాలకు మళ్లించడం వల్లే బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది.

మార్చి మొదటి వారంలో

నిధుల విడుదల

జిల్లాలో లేబర్‌ కాంపోనెంటు కింద దాదాపు రూ.25 కోట్లు, మెటీరియల్‌ కింద రూ.46 కోట్లు చెల్లించాల్సి ఉంది. మార్చి నెల మొదటి వారంలో ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ అయ్యే అవకాశం ఉంది. వేతనాల విషయంలో కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – వెంకటరమణయ్య,

ప్రాజెక్టు డైరెక్టర్‌, డ్వామా, కర్నూలు

ఉపాధి బకాయిలు రూ.130 కోట్లు

గత జనవరి 13 నుంచి నిలిచిపోయిన

చెల్లింపులు

మెటీరియల్‌ పనులకు

నిలిచిపోయిన పేమెంట్లు

ఆందోళన చెందుతున్న కూలీలు

ఉపాధి పనులకు తగ్గిన హాజరు

విధిలేని పరిస్థితుల్లో వలసబాట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement