బాల్య వివాహాలను అరికట్టండి
ఓర్వకల్లు: బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శాంతికళ సూచించారు. ఆమె మంగళవారం మండలంలోని నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని మౌలిక వసతులు, మందులు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లి చేయడం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. బాలికలకు శారీరక ఎదుగుదల, చదువు, పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని సూచించారు. శారీరకంగా, మానసికంగా ఎదిగిన తర్వాతే వివాహాలు జరిపించాలని, చిన్నతనంలో వివాహం చేయడం వల్ల త్వరగా గర్భం దాల్చడం, తద్వారా కలిగే ప్రమాదకర పరిస్థితులు, తల్లీబిడ్డ మరణం ముప్పు పెరిగే అవకాశాలున్నాయని, అలా జరగకుండా తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆరోగ్య కార్యకర్తలకు, ఆశావ ర్కర్లను ఆదేశించారు. గర్భిణుల వివరాలను సకాలంలో ఆర్‌సీహెచ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
బ్రహ్మోత్సవాలకు
శాస్త్రోక్తంగా అంకురార్పణ
ఆళ్లగడ్డ: అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్రమహా దేశికన్ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాలా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విష్వక్సేనుడికి తల పాగా చుట్టి పల్లకీలో కొలువుంచి ఆలయం వెలుపలకు తోడ్కొని వచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలకు పర్యవేక్షుకుడిగా విష్వక్సేనుడు వ్యవహరిస్తారు. అనంతరం పుట్టమన్ను తెచ్చి అంకుర హోమం నిర్వహించి సోమకుంభ స్థాపన చేశారు. బ్రహ్మోత్సోవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం, దిగువ అహోబలంలో బ్రహ్మోత్సవ వేడుకలకు అంకురార్పణ పూజలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment