కాలకూట విషం | - | Sakshi
Sakshi News home page

కాలకూట విషం

Published Wed, Mar 12 2025 7:47 AM | Last Updated on Wed, Mar 12 2025 7:43 AM

కాలకూ

కాలకూట విషం

పొలాల్లో, ఇంటి పరిసరాల్లో పెరిగిన కలుపు తీసేందుకు వాడే పారాక్వాట్‌ క్రిమిసంహారక మందు ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీసేందుకు ఎక్కువగా ఉపయోగపడుతోంది. గ్రామాల్లోని రైతుల ఇళ్లల్లో, పొలాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ మందు, ఇప్పుడు పట్టణాల్లోని వారికి సైతం సులభంగా ఫెర్టిలైజర్స్‌ షాపుల్లో లభ్యమవుతోంది. దీంతో క్షణికావేశంలో దీనిని తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. యాసిడ్‌ కంటే పదుల రెట్ల గాఢత కలిగిన ఈ ద్రావణాన్ని తాగిన వారు 99 శాతం మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. – కర్నూలు(హాస్పిటల్‌)

కర్నూలు మెడికల్‌ కాలేజీకి చెందిన ఓ వైద్యవిద్యార్థిని గత నెల 14న పారాక్వాట్‌ అనే విషరసాయనం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కర్నూలు, అనంతపురం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆమెను బతికించేందుకు తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే కొన్ని రూ.లక్షలలు ఆమె వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా పూర్తిస్థాయిలో కోలుకోలేదు.

కర్నూలు నగరంలోని బి.క్యాంపునకు చెందిన ఓ యువతి(19) ప్రేమించిన వాడు దూరమవుతాడన్న ఆందోళనతో ఈ నెల 9న పారాక్వాట్‌ రసాయన మందు తాగింది. చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్‌ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

పారాక్వాట్‌ రసాయనం

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఓపీ పాయిజన్‌ కేసులుగా వచ్చే వాటిలో అధిక శాతం పారాక్వాట్‌ క్రిమిసంహారక రసాయన మందు నమోదవుతోంది. పంట పొలాల్లో కలుపు తీయడానికి రైతులు ఈ మందును ఎక్కువగా వాడుతుంటారు. వేల లీటర్ల నీటిలో రెండు, మూడు మూతల ద్రావణాన్ని కలిపి ఎకరాల కొద్దీ పొలాల్లో రైతులు ఈ మందును పిచికారీ చేస్తారు. కొద్ది నిమిషాల్లోనే కలుపు మొక్కలు మాడిపోతాయి. అలాంటిది నేరుగా ద్రావణాన్ని తాగితే పరిస్థితి ఎలాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. తాగేందుకు డబ్బా నోట్లో పెట్టుకున్నా గుక్కెడు తాగగానే తట్టుకోలేక పారేసే పరిస్థితి ఉంటుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ ద్రావణం వేగంగా శరీరంలోని జీవకణాలను, అంతర్భాగాల్లోని పైపొరలను దెబ్బతీస్తూ వెళ్లి ప్రాణాలను తీస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన ఈ రసాయాన్ని కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. కానీ ఇక్కడ పప్పు, బెల్లాల్లా దుకాణాల్లో లభ్యమవుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఈ మందు తాగి గత ఏడాది 69 మంది, ఈ యేడాది రెండు నెలల్లోనే 35 మంది చికిత్స కోసం వచ్చారు. ఇందులో కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు పక్కనున్న ఉమ్మడి అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల వారూ ఉన్నారు. ఈ ఆసుపత్రితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, డోన్‌ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఏటా వంద మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 99 శాతం మంది మరణిస్తుండగా తక్కువ మోతాదులో తాగిన వారు మాత్రమే బతికిపోతున్నారు.

పలు దేశాల్లో పారాక్వాట్‌ నిషేధం

ఒడిస్సా రాష్ట్రంలోని బుర్లా జిల్లాలో ఐదేళ్ల క్రితం ఈ విషం భారిన 177 మంది పడ్డారు. ఇందులో ముగ్గురు మాత్రమే జీవించి ఉన్నారు. 2019 సెప్టెంబర్‌లో అక్కడి వైద్యులు నిరసన చేయగా ఒడిస్సా ప్రభుత్వం దీనిని పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చింది. కేరళ రాష్ట్రంలో మాత్రమే దీనిని పూర్తిగా నిషేధించారు. అభివృద్ధి చెందిన 32 దేశాల్లోనూ పారాక్వాట్‌ను పూర్తిగా నిషేధించారు. దీని జన్మస్థానమైన స్విట్జర్లాండ్‌లోనూ ఈ రసాయాన్ని నిషేధించారు. మన దేశంలో కేవలం 9 రకాల పంటలకు మాత్రమే వాడాలని సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్‌ బోర్డు, రిజిస్ట్రేషన్‌ కమిటీ పేర్కొన్నా 25 రకాల పంటలకు వాడుతున్నారు.

ప్రాణాలు తోడేస్తున్న పారాక్వాట్‌

ఏటా వందల మంది మృతి

కర్నూలు జీజీహెచ్‌లో 14 నెలల్లో 104 మందికి చికిత్స

పారాక్వాట్‌కు విరుగుడు లేదు

అభివృద్ధి చెందిన దేశాలతో పాటు కేరళలో నిషేధం

పారాక్వాట్‌కు విరుగుడు లేదు

పారాక్వాట్‌ విష రసాయన పదార్థానికి విరుగుడు లేదు. దీని ప్రభావానికి గురైన వారి లక్షణాలను బట్టి వైద్యం చే స్తాం. దానివల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషం తీసుకున్న వారిలో 99 శాతం మంది మరణిస్తున్నారు.

– డాక్టర్‌ రామశివనాయక్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌ హెచ్‌ఓడీ, జీజీహెచ్‌, కర్నూలు

పీల్చినా విషప్రభావమే

పారాక్వాట్‌ మింగినా, తాకినా చివరకు పీల్చినా విషప్రభావానికి గురైనట్లే. కేవలం ఒక టీ స్పూన్‌ పారాక్వాట్‌ తీసుకోవడం వల్ల మరణం సంభవించవచ్చు. ఈ రసాయనం దుస్తులు, కళ్లు, చర్మాన్ని తాకినా తీవ్ర అనారోగ్యం లేదా మరణానికి కారణం కావచ్చు. దీనిని తాగిన కొన్ని నిమిషాల్లోనే శరీరంలోని ఇతర భాగాల్లోకి వెళ్లి గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులను నాశనం చేస్తుంది.

– డాక్టర్‌ పి.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌, జీజీహెచ్‌, కర్నూలు

No comments yet. Be the first to comment!
Add a comment
కాలకూట విషం 1
1/2

కాలకూట విషం

కాలకూట విషం 2
2/2

కాలకూట విషం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement