● అధికారులను ప్రశ్నించిన జగనన్న కాలనీ లబ్ధిదారులు
కోసిగి: ఇప్పటికిప్పుడే పునాదులు తీసుకోవాలంటే తమ చేత అయ్యే పనేనా అని మండల కేంద్రంలోని జగనన్న కాలనీ లబ్ధిదారులు అధికారుల ఎదుట వాపోయారు. మండల కేంద్రంలోని సజ్జలగుడ్డం రోడ్డులో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో 909 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఎంత మంది పునాదులు తీసుకున్నారు, ఎంత మంది పునాదులు తీసుకోలేదనే వివరాలు సేకరించి నివేదికను తయారు చేసేందుకు మంగళవారం వీఆర్వోలు బలరాం, వీరేష్ కలిసి జగనన్న కాలనీకి రాగా లబ్ధిదారులు కామలదొడ్డి వీరేష్, బసవరాజు, మల్లి, వేమారెడ్డి, మరి కొందరు అక్కడకి చేరుకుని తమ ఆవేదన వెలిబుచ్చారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజే గడువు పూర్తయిందంటే ఎలా అని, ఇప్పటికిప్పుడే పునాదులు వేసుకోవాలంటే తమ ఆర్థిక పరిస్థితి సరిపోతుందా అని నిలదీశారు. ఇప్పటికై నా ప్రభుత్వమే ఇళ్లు మంజూరు చేసి, బిల్లులు విడుదల చేస్తే నిర్మాణాలు ప్రారంభించుకుంటామని బాధితులు విన్నవించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఇక్కడికి వచ్చామని చెప్పి వీఆర్వోలు వెళ్లిపోయారు. అలాగే 16 మంది కుమ్మరి కులస్తులకు కేటాయించిన స్థలంలోనూ ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు వేసుకున్నారని బాధితులు కుమ్మరి కోసిగయ్య, బజారి, నాగరాజు, నరసింహ, అంబమ్మ ఆరోపించారు. ఇదే విషయమై ఫిబ్రవరి 6న తహసీల్దార్‌ను కలిసి ఫిర్యాదు చేసినా పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై తహసీల్దార్ రుద్రగౌడను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఆర్వోలు జగనన్న కాలనీలో సర్వే చేపట్టారని, కుమ్మరి కులస్తులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడికీ పోవని, ప్రైవేట్ వ్యక్తులు వేసిన లేఅవుట్లను రీసర్వే చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పారు.
ఇప్పటికిప్పుడే పునాదులు ఎలా తీసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment