బ్యాంకుల సమ్మెను విజయవంతం చేద్దాం
● యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా నాయకులు
కర్నూలు (అగ్రికల్చర్): న్యాయమైన డిమాండ్‌లను సాధించుకునేందుకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయు) పిలుపు మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని వివిధ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు కోరారు. మంగళవారం వివిధ బ్యాంకుల రీజినల్ కార్యాలయాల ఎదుట ఆయా బ్యాంకుల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు, కెనరా బ్యాంకు రీజినల్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీ కే.పుష్పక్ మాట్లాడారు. ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంకు ఉద్యోగులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ చట్టాన్ని సవరించి రూ.25 లక్షల వరకు గరిష్ట పరిమితిని పెంచాలని కోరారు. కెనరా బ్యాంకు వర్క్‌మెన్ ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ కమిటీ సభ్యుడు అనిల్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని కేడర్‌లలో తగిన నియామకాలు చేపట్టాలని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ వాటా 51 శాతం ఉండేలా చూడాలని కోరారు. ఈ నెల 13, 18వ తేదీల్లో ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగే చర్చలకు యూఎఫ్‌బీయూ నేతలు హాజరవుతున్నారని, చర్చలు ఫలించకపోతే రెండు రోజుల సమ్మెకు సిద్ధం కావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment