పన్నులు చెల్లించకుంటే సేవలు బంద్
● డ్రస్ సర్కిల్ షాపు వద్ద నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ సిబ్బంది
కర్నూలు (టౌన్): ఈనెల 31లోపు పన్నులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్‌జీవీ క్రిష్ణ హెచ్చరించారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది మంగళవారం బకాయిలు ఉన్న వ్యాపార దుకాణాల వద్దకు వెళ్లి యాజమాన్యాల తీరును నిరసించారు. అందులో భాగంగా అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని డ్రస్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టగా రూ.6.79 లక్షల బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం లిఖిత పూర్వకంగా రాసివ్వడంతో వెనుదిరిగారు. మేడం కాంపౌండ్‌లోని వాణిజ్య సముదాయాలకు సంబంధించి రూ.5.57 లక్షల బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ఆదేశాలను పట్టించుకోకపోతే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్లు జునీద్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు భార్గవ్, తిప్పన్న, రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment