చౌడేశ్వరీ మాతను దర్శించుకున్న బాలనటి శ్రీదేవి
బేతంచెర్ల: పట్టణానికి సమీపంలోని కొలుములపల్లె రహదారిలో వెలసిన చౌడేశ్వరీ మాతను బింబిసారలో బాలనటిగా నటించిన శ్రీదేవి మంగళవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా చౌడేశ్వరీ మాత ఆలయంలో తల్లిదండ్రులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, భార్య లక్ష్మి వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. నందమూరి కళ్యాన్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో బాలనటిగా శ్రీదేవి నటించింది. మాటీవీలో చిన్ని, జీటీవీలో కళ్యాణ వైభోగం సీరియల్‌తోపాటు కొత్తగా రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శాంతి భద్రతలకువిఘాతం కలిగిస్తే చర్యలు
● ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఆలూరు రూరల్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వేసి ఉంచాలన్నారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించి శాంతి భద్రతలపై సీఐ వెంకటచలపతి, ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.
ప్రాణం తీసిన మలుపు
● బైకు అదుపుతప్పి యువకుడి మృతి
కొత్తపల్లి: మూల మలుపు వద్ద బైకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని శివపురం గ్రామానికి చెందిన హరికృష్ణయాదవ్(37) ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గ్రామ సమీపంలో లింగమయ్య స్వామిని దర్శించుకుని పల్సర్ బైకుపై ఇంటికి తిరుగు పయనం అయ్యాడు. శివపురం గ్రామ పోలిమేరలోని జమ్ములమ్మ గుడి వద్ద మలుపు ఉండటంతో బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన పిచ్చి మొక్కల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని కొత్తపల్లికి, అక్కడి నుంచి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య శ్రావణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొత్తపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
చౌడేశ్వరీ మాతను దర్శించుకున్న బాలనటి శ్రీదేవి
చౌడేశ్వరీ మాతను దర్శించుకున్న బాలనటి శ్రీదేవి
Comments
Please login to add a commentAdd a comment