గర్భదారణ సమస్యలపై దృష్టి సారించాలి
కర్నూలు(హాస్పిటల్): గర్భం దాల్చినప్పుడు మహిళలకు అనేక సమస్యలు వస్తాయని, వాటిని ఎప్పటికప్పుడు వైద్యులు గమనిస్తూ తగిన చికిత్సలు అందించాలని, అప్పుడే తల్లీబిడ్డలు పూర్తిగా క్షేమంగా ఉంటారని వైద్యనిపుణులు అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆబ్‌స్ట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఫాగ్సి) ఆధ్వర్యంలో కర్నూలు కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాయలసీమలోని వైద్యులకు నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు (సీఎంఈ) నిర్వహించారు. కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది వరకు గైనకాలజిస్టులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గైనకాలజిస్టు డాక్టర్ కేపీ. శిల్పా మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సదుపాయాలతో గర్భస్థ మహిళలతో పాటు వారి కడుపులో ఉండే శిశువులకు వచ్చే ఎలాంటి సమస్యలైనా పరిష్కరించవచ్చని చెప్పారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డాక్టర్ కె.మహమ్మద్ ఫారూక్ మాట్లాడుతూ గర్భస్థ శిశువులకూ గుండెకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చని, ప్రసవం అయిన తర్వాత వీలైనంత వెంటనే వాటికి తగిన చికిత్సలు అందించాలని తెలిపారు. అనంతరం గర్భిణిలకు వచ్చే పచ్చకామెర్లు, గుండె సమస్యలు, హైబీపీ, మధుమేహం, ఇతర సమస్యలు, వాటిని గుర్తించి చికిత్స చేసే పద్ధతుల గురించి నిపుణులు వివరంగా చర్చించారు. కార్యక్రమంలో ఫాగ్సీ ప్రెసిడెంట్ ఎస్.వెంకటరమణ, కార్యదర్శి వి.రాధాలక్ష్మి, గర్భస్థ శిశు సమస్యల నిపుణురాలు కె.నివేదిత, గైనకాలజిస్ట్, వై.కుసుమ, కె.లక్ష్మీప్రసన్న, ఎ.సుధారాణి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు కె.నవీన్, ఎస్.జె. జానకీరామ్, ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్టు జి.సందీప్‌కుమార్, నియోనెటాలజిస్టు ఎన్.భారతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment