● ఊరెళుతూ నగలన్నీ వెంట తీసుకెళ్లిన వృద్ధురాలు ● ఇంట్లో చోరీకి యత్నించి విఫలమైన దుండగులు
పత్తికొండ రూరల్: పట్టణంలోని రెండు ఇళ్లలో దొంగలు చోరీకి యత్నించారు. ఓ ఇంట్లోని బామ్మ తన ఇంట్లోని నగలు ఏమీ ఉంచకపోవడం.. మరో ఇంట్లో కూడా రూపాయి కూడా లభ్యం కాకపోవడంతో దొంగలు చిర్రెత్తి బీరువాలోని వస్తువులను చిందరవందరగా పడేసి ఉడాయించారు. బాధితులు తెలిపిన వివరాలు.. స్థానిక షిరిడీసాయి స్కూల్ సమీపంలో హేమకాంతరెడ్డి ఇల్లు ఉంది. ఇతను వ్యాపార రీత్యా బెంగళూరులో ఉండటంతో వృద్ధురాలైన అతని తల్లి లక్ష్మిదేవి ఒక్కరే ఇంటి వద్ద ఉంటోంది. ఆమె కూడా మంగళవారం గుత్తిలోని బంధువుల ఇంటికి వెళ్తూవెళ్తూ ఇంట్లోని విలువైన ఆభరణాలు, నగదును ఒక సంచిలో వేసుకుని వెంట తీసుకెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో దొంగలు అర్ధరాత్రి లోపలకు చొరబడ్డారు. ఉడెన్ లాకర్లు, అల్మారా లాక్‌లు పెకిలించి చూసినా చిల్లిగవ్వ దొరకలేదు. చిర్రెత్తి చీరలు, వస్తుసామగ్రిని చిందరవందరగా పడేశారు. ఇత్తడి పూతతో ఉన్న వడ్డాణం, ఇతర ఆభరణాలపై గీసి మరీ పరీక్షించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం ఇంటికొచ్చిన వృద్ధురాలికి తాళాలు పగులగొట్టి ఉండటం కనిపించింది. ఇంట్లో ఏమీ చోరీ కాకపోవడంతో వృద్ధురాలిని కుటుంబ సభ్యులు అభినందించారు. ఇదే ఇంటి సమీపంలోని చెరువు పెద్దయ్య ఇంట్లోనూ చోరీకి యత్నించి దొంగలు విఫలమయ్యారు. కాగా సుమారు ఐదుగురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. పోలీసులు క్లూస్‌టీంతో విచారణ చేపట్టారు.