సెల్‌ఫోన్ చూడొద్దని తండ్రి మందలింపు..
కుమారుడి ఆత్మహత్య!
కర్నూలు: పనికి వెళ్లకుండా నిత్యం సెల్‌ఫోన్‌లో కాలక్షేపం చేస్తున్న కుమారుడిని తండ్రి మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలులో బుధవారం చోటు చేసుకుంది. వివరాలివీ.. కల్లూరు మండలం చౌడేశ్వరి వీధిలో నివాసముంటున్న కమ్మరి కృష్ణమోహనాచారి, వసంత దంపతులకు కుమారుడు, కూతురు సంతానం. కృష్ణమోహనాచారి వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య కూలీ పనులకు వెళ్లేది. కుమారుడు యశ్వంతాచారి(21) 8వ తరగతిలోనే చదువు మానేసి వడ్రంగి పనులు నేర్చుకునేవాడు. కొంతకాలంగా ఎప్పుడూ సెల్‌ఫోన్ చూస్తూ పనులకు పోకుండా ఉండటంతో మంగళవారం ఉదయం తండ్రి మందలించాడు. దీంతో కుమారుడు కోపంతో సెల్‌ఫోన్‌ను నేలకేసి పగులకొట్టి పనికి పోకుండా ఇంట్లోనే పడుకున్నాడు. బుధవారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లిన తర్వాత యశ్వంతాచారి ఇంటి హాల్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. తల్లి వసంత ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇరుగుపొరుగు వారి సాయంతో అతన్ని కిందకు దించి ఆటోలో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, కేసు కూడా అవసరం లేదని తల్లిదండ్రులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment