పోలీసులకు గ‘మ్మత్తు’ సమచారం
కర్నూలు: కర్నూలు–నంద్యాల జాతీయ రహదారిలోని కాల్వబుగ్గ, సోమయాజులపల్లె మధ్య తన ఆటోను దోపిడీ దొంగలు తీసుకెళ్లారని పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు ఒక వ్యక్తి ఫోన్‌కాల్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై ఘటనా ప్రాంతానికెళ్లి చూడగా తప్పుడు సమాచారంగా తేలింది. ఊపిరి పీల్చుకున్న పోలీసులు.. తప్పుడు సమాచారం ఇచ్చిన ఆటోవాలాను మందలించి పంపారు. పోలీసుల విచారణలో తేలిన వివరాలు ఇలా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆటోడ్రైవర్ మనోజ్ జమ్మలమడుగులో వివాహం చేసుకున్నాడు. భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లడంతో ఆమెను తీసుకురావడానికని వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో నంద్యాల నుంచి 11 గంటలకు కర్నూలుకు బయలుదేరాడు. ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాల్వబుగ్గ వద్ద ఆటో లోయలో పడి డ్రైవర్ మనోజ్ గాయాలకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న అతను తన ఆటోను దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో అది కమాండ్ కంట్రోల్‌కు చేరింది. దీంతో కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ చెక్‌పోస్టు, కర్నూలు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేసి తనిఖీ నిర్వహించారు. అర్ధరాత్రి ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్ చేరుకుని కాల్వబుగ్గ దగ్గరకు వెళ్లి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించగా ఆటో లోయలో పడినట్లు గుర్తించారు. మనోజ్‌ను విచారించగా మద్యం మత్తులో ఉన్న తాను ఏమి మాట్లాడానో గుర్తు లేదని, బ్రెయిన్ సరిగా పనిచేయడం లేదని తప్పు ఒప్పుకున్నాడు. దీంతో అతనిని పోలీసులు మందలించి కౌన్సెలింగ్ చేసి పంపించారు. లోయలో పడిన ఆటోను జేసీబీ సాయంతో తీయించారు.
ఆటోను దొంగలు
తీసుకెళ్లారని చెప్పిన ఆటోవాలా
పోలీసులకు గ‘మ్మత్తు’ సమచారం