గ్యాస్ డెలివరీలో నిలువు దోపిడీ!
● కనీసంగా రూ.30 వసూలు
● అంతస్తులు పెరిగే కొద్ది
రూ.10 పెంచుతున్న వైనం
● 15 కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుం
వసూలు చేయరాదంటున్న నిబంధనలు
● దోపిడీకి డెలివరీ బాయ్స్‌కు అనుమతి
ఇస్తున్న గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యాలు
● ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు సృష్టిస్తున్న
డెలివరీ బాయ్స్
● చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న
పౌరసరఫరాల అధికారులు
కర్నూలు(సెంట్రల్): గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం 15 కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుం వసూలు చేయరాదు. 15 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు సిలిండర్‌కు రూ.30 వసూలు చేయాలి. అయితే ఎక్కడా ఆ నిబంధనలు అమలు కావడం లేదు. ఐదు కిలోమీటర్ల లోపే సిలిండర్లు డెలివరీ అవుతున్నా కనీసంగా రూ.30 వసూలు చేస్తున్నారు. అపార్టుమెంట్లలో అంతస్తుకు రూ.15 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారు. మొదటి అంతస్తులోకి సిలిండర్ రావాలంటే రూ.45, రెండో అంతస్తులోకి రావాలంటే రూ.50, మూడో అంతస్తులోకి రావాలంటే రూ.60 వరకు వసూలు చేస్తున్నారు.
ఎదురిచ్చి గ్యాస్ సిలిండర్ల డెలివరీ!
జిల్లాలో దాదాపు 30 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో 6,67,456 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా, భారత్, హెచ్‌పీ, ఐఓసీ కంపెనీలు గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయి. ఎక్కువగా ప్రజలు భారత్ గ్యాస్ కంపెనీ సిలిండర్లనే వినియోగిస్తున్నారు. నిబంధనలు ప్రకారం ఒక వినియోగదారుడు బుక్ చేసుకున్న సిలిండర్‌ను డెలివరీ చేసేందుకు నిర్వహణలో ఉన్న ఏజెన్సీలు వాహనాలు, బాయ్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. బాయ్స్‌కు వారే జీతా లు ఇవ్వాలి. అయితే ఏజెన్సీలలు ఇక్కడే మోసం చేస్తున్నాయి. సొంతంగా ఆటోలు ఉన్న వారితో కలసి సిలిండర్లను డోర్ డెలివరీ చేసే బాధ్యతను వారికి అప్పగిస్తున్నారు. ఇలా వారి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఏజెన్సీ నిర్వాహకులు ఆటోగాని, డెలివరీ బాయ్‌కుగాని ఎలాంటి బాడుగ, జీతాలు చెల్లించరు. ఆటో యజమానే డెలివరీ చేసి వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలి. దీంతో ఆటో యజమానులు గిట్టుబాటు కోసం దోపిడీ చేస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు అయితే ఆటో యజమానులే ఎదురు చెల్లించి డెలివరీ చేసేందుకు ఒప్పందం చేసుకుంటారట. దీంతో డెలివరీ బాయ్స్ కనీసంగా రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేసుకొని గిట్టుబాటు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సిలిండర్ బిల్లింగ్‌లో డెలివరీ కోసం కేటాయించిన మొత్తం ఏజెన్సీల ఖాతాలోకి వెళ్లిపోతోంది. మొత్తంగా వినియోగదారుడే ఏజెన్సీ, డెలివరీ బాయ్ చేతిలో మోసపోయి దగాపడుతున్నాడు.
నోటీసులతో సరి..
గ్యాస్ పంపిణీపై నెలరోజులుగా 60కి పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో గ్యాస్ డెలివరీ కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులే అధికం. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో ఏజెన్సీలకు అధికారులు నోటీసులు ఇచ్చిసరిపెట్టారు. వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఇటీవల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి డెలివరీ కోసం డబ్బులు తీసుకోరాదని స్వయంగా జేసీ డాక్టర్ బి.నవ్య చెప్పారు.
ఫిర్యాదు చేస్తేనే చర్యలు
గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీని పౌర సరఫరాల అధికారులు పరిశీలించడం లేదు. నెలవారీగా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి వస్తున్న డబ్బులు తీసుకొని మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిలిండర్ డెలివరీ విషయంలో చాలామంది వినియోగదారులు బాయ్స్‌తో గొడవ పడి ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దోపిడీ యథాతథంగా కొనసాగుతోంది.
నిబంధనలు పాటించాలి
15 కిలోమీటర్ల వరకు గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఎలాంటి రుసుం వసూలు చేయరాదు. అలా వసూలు చేస్తే మాకు ఫిర్యాదు చేయాలి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నాం. వచ్చిన ఫిర్యాదులను వచ్చినట్లుగానే పరిష్కరిస్తున్నాం. 15 కిలో మీటర్లు దాటితే సిలిండర్‌కు రూ.30 వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయి. ఏజెన్సీలు విధిగా నిబంధలను పాటించాలి.
–రాజారఘువీర్, డీఎస్‌ఓ, కర్నూలు
గ్యాస్ డెలివరీలో నిలువు దోపిడీ!
Comments
Please login to add a commentAdd a comment