అమరజీవికి ఘన నివాళి
కర్నూలు: జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయ మైదానంలో చిత్రపటానికి అడ్మిన్ అడిషనల్ ఎస్‌పీ హుసేన్‌పీరా పూలమాల వేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను, సేవలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని ఆడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నెలాఖరులోపు రుణాలు చెల్లిస్తే అపరాధ వడ్డీ మినహాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకులో నిరర్థక ఆస్తులుగా మిగిలి పోయి న దీర్ఘకాలిక రుణాల రికవరీల కోసం ఉద్దేశించిన ఉపశమన పథకం గడువు ఈ నెల చివరి వరకు మాత్రమే ఉందని సీఈఓ విజయకుమార్ తెలిపారు. డీసీసీబీ బ్రాంచీల ద్వారా దీర్ఘకాలిక రుణాలు తీసుకొని.. రికవరీ చేయక నిరర్థ్ధక ఆస్తులుగా మిగిలిపోయిన బకాయిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల చివరిలోపు అప్పు మొత్తాన్ని చెల్లిస్తే.. అపరాధ వడ్డీ మినహాయింపు ఉంటుందని, వడ్డీ మీద వడ్డీలో గరిష్టంగా రూ.50 వేల వరకు మాఫీ ఉంటుందన్నారు. ఇటువంటి బకాయిలు ఉమ్మడి జిల్లాలో రూ.15 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలిక రుణాలు అంటే డెయిరీ, గొర్రెల, మైనర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వంటి వాటికి తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు.
రూ.61.22 కోట్ల పన్ను వసూళ్లు
కర్నూలు (టౌన్): 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కర్నూలు నగరపాలక సంస్థ ఆస్తి, నీటి పన్నులను రూ.61.22 కోట్లు వసూలు చేసినట్లు ఆ సంస్థ మేనేజర్ చిన్నరాముడు తెలిపారు. ఆదివారం ఆయన పన్ను వసూళ్ల కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. పన్ను వసూళ్లు నగరంలో ముమ్మరంగా సాగుతుందన్నారు. సెలవు రోజైన ఆదివారం రెవెన్యూ, సచివాలయాల సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారన్నారు. ఈ నెలాఖరుకు 100 శాతం పన్నులు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం పేరుతో రూపొందించిన నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని శ్రీశైల దేవస్థానం ఈఓ ఎం. శ్రీనివాసరావు భక్తులకు సూచించారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు, ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు పొందేందుకు దేవస్థానం ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. అయితే, ఈసేవలు పొందేందుకు దేవస్థానం వెబ్‌సైట్ www.srisailadevasthanam. org, దేవదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్ www. aptemples. ap. gov. inలను మాత్రమే వినియోగించుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351/52/53ను సంప్రదించాలన్నారు.
26 నుంచి హ్యాండ్‌బాల్ పోటీలు
కర్నూలు (టౌన్): ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు బిహార్ రాష్ట్రాంలోని జహీరాబాద్‌లో 46 వ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ జూనియర్ బాలుర చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి. శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment