● ఎల్లెల్సీలో పడి మహిళా కూలీ మృత్యువాత
హాలహర్వి: వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీ ప్రమాదవశాత్తూ ఎల్లెల్సీ కాల్వలో పడి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆలూరు మండల మొలగవల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి(40) మంగళవారం గూళ్యం గ్రామానికి చెందిన ఓ రైతు మిరప పంట కోసేందుకు తోటి కూలీలతో కలసి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ పచ్చారపల్లి వద్ద నీళ్లు తాగేందుకు ఎల్లెల్సీ కాలువలోకి దిగింది. ప్రమాదవశాత్తూ కాలు జారి శ్రీదేవి కాలువలో పడిపోయింది. పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ మునిస్వామి రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సమాచారం అందుకున్న హాలహర్వి ఎస్‌ఐ చంద్ర వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. గూళ్యం 48వ డీప్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతురాలికి భర్త భగీరథ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్ర తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని..
● వృద్ధుడి మృతి
● యువకుడికి తీవ్ర గాయాలు
పత్తికొండ రూరల్: అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. టిఫిన్ చేసేందుకు హోటల్ వెళ్లిన వృద్ధుడు తిరిగిరాని లోకాలకు చేరాడు. పత్తికొండ పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో యువకు డు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దాసరి వీధిలో బోయ హనుమన్న, తిమ్మక్కలు నివాసముంటున్నారు. వారి కుమారుడు భార్యా పిల్లలతో బతుకుదెరువుకు గుంటూరు వలస వెళ్లారు. ఇంటి వద్ద వున్న తిమ్మక్క మంగళవారం మిరపకాయలు తెంపేందుకు కూలికి వెళ్లగా.. హనుమన్న టిఫిన్ చేసేందుకు టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై ప్రభుత్వ బీసీ హాస్టల్ సమీపంలోని ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్లాడు. టిఫిన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేందుకు వాహనాన్ని తీస్తుండగా పత్తికొండకు చెందిన కూరగాయల వ్యాపారి అభిరాం పల్సర్ బైక్‌తో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కోలు కోలేక వృద్ధుడు మృతి చెందాడు. యువకుడు అభి రాం చికిత్స పొందుతున్నాడు. భర్త మృతితో భార్య తిమ్మక్క రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దాహం తీర్చుకునేందుకు వెళ్లి..