జెడ్పీ నిధుల తగ్గింపుతో ఇబ్బందులు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ (జెడ్పీ)లకు విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. జిల్లాకు వచ్చిన పీఆర్‌అండ్‌ఆర్‌డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్, డైరెక్టర్ కృష్ణతేజను శనివారం కలిసి వినతిపత్రం అందించారు. జెడ్పీకి 15 శాతం కింద రూ.25 కోట్ల మేర నిధులు విడుదలవుతున్నాయని, జిల్లాలోని సీపీడబ్ల్యూఎస్ పథకాల ఆపరేషన్, నిర్వహణకు వ్యయం అవుతున్న రూ.80 కోట్లను భరించడం చాలా కష్టంగా మారిందన్నారు. ఇంత కష్టాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులను 10 శాతానికి తగ్గింపు నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరారు. లేని పక్షంలో కనీసం రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులనైనా విడుదల చేయాలని కోరారు. అలాగే జెడ్పీ పాత పరిపాలనా భవనాన్ని రాష్ట్ర పర్యాటక శాఖకు లీజుకు వచ్చే ప్రతిపాదనను కూడా త్వరగా పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల పలు రకాల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓలు వినియోగిస్తున్న ప్రభుత్వ వాహనాలు రవాణా శాఖ నిబంధనల మేరకు కాలాతీతమైనందున ఇద్దరు అధికారులు అద్దె వాహనాలు వినియోగించుకునేందుకు అనుమతితో పాటు వాటి బాడుగలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో లిఫ్ట్ సౌకర్యం కోసం రూ.48 లక్షల అంచనాతో దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు పంపిన ప్రతిపాదనలపై ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు ఉన్నతాధికారులతో చైర్మన్ సుదీర్ఘంగా చర్చించారు.
పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్‌ను
కలిసిన జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment