ఉల్లాస్... ఉత్తుత్తి పరీక్ష!
కర్నూలు సిటీ: ఉల్లాస్ కార్యక్రమం కింద చదువు నేర్పించకుండానే ఆదివారం పరీక్ష నిర్వహించారు. ‘ఉల్లాస్’ కింద స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పాలి. జిల్లాలోని కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్, దేవనకొండ, కృష్ణగిరి, కోడుమూరు, ఆస్పరి, కోసిగి మండలాల్లోని 28,872 మంది పొదుపు మహిళలకు 2,887 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో అక్షర జ్ఞానాన్ని నేర్పించే కార్యక్రమాన్ని వయోజన విద్యకు చెందిన సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేయాలి. కానీ వారు జిల్లా కేంద్రానికి పరిమితమై పర్యవేక్షణ చేయలేకపోయారు. కొన్ని కేంద్రాల్లో స్వచ్ఛందంగా పొదుపు సంఘాల్లోని చదువుకున్న వారు అక్షరాలను నేర్పించినా...అది సంతకాల వరకే పరిమితం అయ్యింది. కొన్ని చోట్ల మినహా చాలా చోట్ల చదువు చెప్పించకపోయినా కూడా ఆదివారం పరీక్ష నిర్వహించారు. మెజార్టీ కేంద్రాల్లో డీఆర్‌డీఓ గుర్తించిన నిరక్షరాస్య మహిళలు కాకుండా వారి పిల్లలు, అప్పటికే చదువుకున్న వారికి పరీక్ష నిర్వహించారు. కొన్ని చోట్ల పరీక్ష నిర్వహించకుండానే మహిళలతో సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.
తనిఖీ చేసిన డీడీ
జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పరీక్షను వయోజన శాఖ డీడీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. ఓర్వకల్లు మండలంలోని పాలకొల్లు గ్రామంలోని కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట పర్యవేక్షకులు నెమలయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment