కర్నూలు: కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలను కమాండెంట్ దీపిక పాటిల్ అభినందించి సత్కరించారు. ఈనెల 16న విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వెంకటరత్నం (80) వచ్చి ప్రమాదవశాత్తూ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కెనాల్‌లో పడిపోయాడు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న రెండో బెటాలియన్ ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆర్‌ఎస్‌ఐ మహేంద్ర నాయక్, శివ, పద్మనాభం, సుదర్శన్ రెడ్డి, హుసేన్, నాగన్న, సత్యనారాయణ తదితరులు పడవ సాయంతో వృద్ధుడిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందుకు గాను ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలను అభినందిస్తూ మంగళవారం కమాండెంట్ దీపిక పాటిల్ తన కార్యాలయంలో ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ నాగేంద్ర రావు, ఎస్‌డీఆర్‌ఎఫ్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి, ఆర్‌ఐ సాయికుమార్ పాల్గొన్నారు.