మేలైన యాజమాన్య పద్ధతులతో నాణ్యమైన దిగుబడి
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉందని.. రైతులు అధిక దిగుబడి, నాణ్యతను పెంపొందించుకోవడంతో పాటు నిల్వ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. మంగళవారం ఉద్యానశాఖ ఉల్లి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు కర్నూలులోని ఉద్యానభవన్‌లో శిక్షణ, చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా ఉద్యాన అధికారి పి.రామంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఏటా 5.40 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోందన్నారు. అవగాహనతో సాగు చేపడితే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని, నాణ్యత బాగుంటే గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నారు.
● జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు మాట్లాడుతూ ఉల్లి సాగులో ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
● మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి మాట్లాడుతూ పండించిన పంటను బాటీ ఆరబెట్టి గ్రేడింగ్ చేసుకొని మార్కెట్‌కు తీసుకొస్తే గిటుబాటు ధర లభించే అవకాశం ఉంటుందన్నారు.
● ఏపీఎంఐపీ అదనపు పీడీ రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగు చేసుకోవచ్చని, ఎరువుల వినియోగం కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు.
● మహానంది వైఎస్‌ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఠాగూర్‌నాయక్ మాట్లాడుతూ ఉల్లి సాగులో మేలైన యాజమాన్య పద్దతులను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment