కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో మూడు సంఘాలకు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. కర్నూలులోని కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలో నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అథితిగా రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ సేవానాయక్ హాజరయ్యారు. పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వ గుర్తింపు పొందిన వెటర్నరీ అసిస్టెంట్స్ అసోసియేషన్, లైవ్‌స్టాక్ అసిస్టెంట్స్ సర్వీస్ అసోసియేషన్, జూనియర్ వెటర్నరీ అఫీసర్స్ అసోసియేషన్/ వెటర్నరీ లైవ్‌స్టాక్ అఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు.
● ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా శాఖ చైర్మన్‌గా జి.వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా బజారి, ఉపాధ్యక్షులుగా జనార్దన్‌రెడ్డి, రాముడు,వెంకట రమణయ్య, ప్రధాన కార్యదర్శిగా రంగన్న, కోశాధికారిగా గంగ ఎన్నికయ్యారు.
● లైవ్‌స్టాక్ అసిస్టెంట్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీసీ సుబ్బరాయుడు, అసోసియేట్ ప్రసిడెంటుగా భరత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆయేశ్వరి, కోశాధికారిగా రాజేష్ ఎన్నికయ్యారు.
● వెటర్నరీ అసిస్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా స్రవంతి, అసోసియేట్ అధ్యక్షుడుగా మద్దిలేటి, ప్రధాన కార్యదర్శిగా హనుమంతు, కోశాధికారిగా శశిధర్ ఎన్నికయ్యారు.
● ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా నాయకులు జవహర్‌లాల్, సాంబశివారెడ్డి, రమణ, భాస్కరనాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్‌అండ్‌బీ రహదారిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సంజామల మండలం కానాలకు చెందిన మేడిగ దానియేలు(45) వ్యవసాయ, ఉపాధి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సొంత పనుల నిమిత్తం స్కూటీపై ఆళ్లగడ్డకు వెళుతుండగా పట్టణ శివారులోని పేరా బిల్డింగ్ వద్ద అటువైపే వెళుతున్న టర్బో లారీ వెనుక వైపు నుంచి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దానియేలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రాణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళుతుండటంతో ప్రమాద ఘటనను చూసిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొర్నిపాడు వద్ద లారీని ఆపి పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవపరీక్ష నిమత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.