కర్నూలు(సెంట్రల్): పేదలకు ఇళ్లస్థలాలు అందడం లేదు. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పిన టీడీపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పేదలు ఎవరూ ఇంటిస్థలం కావాలని అడగకుండా ఇంటి నిర్మాణం కోసం అదనపు సాయం ఇస్తామని మోసం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం జిల్లాలో ఇప్పటి వరకు 39 వేల మంది పేదలు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒక్కరికీ కూడా ఇంటిస్థలం మంజూరు చేయలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పార్టీలు, కులాలకు అతీతంగా సిక్స్ స్టెప్ వ్యాలిడేట్ ఆధారంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. జిల్లాలో ఏకంగా 48 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటి నిర్మాణం కోసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఇళ్లస్థలాలు మంజూరు చేయడం లేదు. కొత్తగా మంజూరు చేసే ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వొచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి.
మభ్యపెట్టేందుకే అదనపు సాయం
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 48 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇందులో 39వేల మందికి పీఎంఏవై అర్బన్–వైఎస్‌ఆర్ జగనన్న పేరిట ఇళ్లను మంజూరు చేశారు. అందులో దాదాపు 22 వేల ఇళ్లనిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 16 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాటిని తానే పూర్తి చేశానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఇళ్ల నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం పేరిట జీఓ నంబర్ 9 విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.70 వేలను మంజూరు చేస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో 5,170 మంది బీసీలు, 4,028 మంది ఎస్సీలు, 248 మంది ఎస్టీ లబ్ధిదారులు మొత్తం 9,446 మందికి అదనపు సాయంగా మొత్తం 47. 85 కోట్లు మంజూరు అవుతాయి. అయితే అదనపు సాయం చేయడంలో పెద్ద మతలబు ఉంది. ఆయన తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తానని ఇచ్చిన హామీలను హుళక్కి చేయవచ్చే పన్నాగం ఉంది. ఎన్టీఆర్ కాలనీల్లోని ఇళ్లను పూర్తి చేస్తే ఇంకా ఎవరూ ఇంటిస్థలం కావాలని అడగరని, ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇవ్వాలని కోరరనే అదనపు సాయానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.
ఓర్వకల్లులోని జగనన్న కాలనీ
ఇళ్ల స్థలాల కోసం జిల్లాలో
39 వేల మంది దరఖాస్తు
ఒక్కరికీ మంజూరు కాని ఇంటిస్థలం
ప్రజలను మభ్యపెట్టేందుకే అదనపు సాయం
పేరు మార్చి వంచన
జగనన్న కాలనీలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోరు పారేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పేదలకు ఇచ్చిన సెంటున్నర స్థలం బాత్ రూమ్ నిర్మాణానికి కూడా సరిపోదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అధికారంలోకి రాగానే అదే జగనన్న కాలనీల పేర్లను ఎన్‌టీఆర్ కాలనీలుగా మార్చారు. ఇప్పుడు అదే ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం చేసి తాను ఇచ్చిన మేజర్ హామీలను పక్కదారి పటిస్తున్నారు. స్థలం లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తానని, ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇస్తానని చెప్పినా హామీలను ఎవరూ అడగరు అనే కోణంలో అదనపు సాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనల మేరకు ఇళ్లస్థలాలు
పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. గతంలో ఎక్కడా ఇంటి స్థలం పొందని వారికే కొత్త జాబితాలో చోటు ఉంటుంది. ఎన్టీఆర్ కాలనీల్లో ఇళ్ల స్థలం ఉన్న వారు అనర్హులు అవుతారు. నిబంధనలు మేరకు ఇళ్లస్థలాలు ఇవ్వనున్నాం.
– పి.రంజిత్‌బాషా, కలెక్టర్, కర్నూలు
ప్రభుత్వంపై వ్యతిరేకత
సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట ప్రకా రం పట్ట ణాల్లో 2, గ్రామీణ ప్రాంతా ల్లో 3సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇవ్వాలి. మంజూరయ్యే ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణ వ్యయాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇస్తే ప్రజలు తిరగబడతారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
– రామకృష్ణారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి, కర్నూలు
పేదలకు ‘అదనపు’ మోసం
పేదలకు ‘అదనపు’ మోసం