ఆస్పరి: మండలంలోని కై రుప్పల గ్రామంలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి నిర్వహించనున్నట్లు మంగళవారం ఆలయ కార్యనిర్వహణాధికారి రాంప్రసాద్, సర్పంచ్ తిమ్మక్క, గ్రామ పెద్దలు తెలిపారు. ఈనెల 28 ధ్వజారోహణ సందర్భంగా ఆలయంలో వీరభద్రస్వామి, కాళికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. 29న పూజా కార్యక్రమం, 30న ఉగాది, 31న పెద్దనుగ్గులాట, ఏప్రిల్ 1వ తేదీన స్వామి వారికి ప్రత్యేక పూజలు, 2న సాధారణ పూజలు, 3న రథోత్సవం, 4న ప్రత్యేక పూజలు, 5న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
ఏప్రిల్ 1 వరకు ఎండుమిర్చి, వాము క్రయవిక్రయాలు బంద్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎండుమిర్చి, వాము క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున అకౌంట్స్‌ను క్లోజ్ చేసుకోవాల్సి ఉందని.. వాము, ఎండుమిర్చి క్రయవిక్రయాలు చేపట్టలేమని వ్యాపారస్తుల అసోషియేషన్ చెప్పినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని, కమీషన్ ఏజెంట్లు కూడా ఆయా సరుకులను తెప్పించరాదని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.
డ్వామాలో బదిలీల ప్రక్రియ పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నీటియాజమాన్య సంస్థలో బదిలీల ప్రక్రియ పూర్తయింది. వివిధ కేటగిరీల్లో 119 మందిని బదిలీ చూస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డ్వామా పీడీ వెంకటరమణయ్య తెలిపారు.
● ఆలూరు క్లస్టర్ ఏపీడీగా పనిచేస్తున్న పద్మావతిని కర్నూలు క్లస్టర్‌కు, కర్నూలు క్లస్టర్ ఏపీడీగా పనిచేస్తున్న లక్ష్మన్నను పత్తికొండ క్లస్టర్‌కు, పత్తికొండ క్లస్టర్ ఏపీడీగా పనిచేస్తున్న పక్కీరప్పను ఆలూరు క్లస్టర్ ఏపీడీగా బదిలీ చేశారు.
● ఏపీవోల్లో ఎం.తిమ్మారెడ్డిని మంత్రాలయం నుంచి హొలగొంద మండలానికి, జి.మద్దేశ్వరమ్మను కల్లూరు నుంచి ఓర్వకల్‌కు, కే.వెంకటేశ్వర్లును పత్తికొండ నుంచి తుగ్గలికి, ఎం.భక్తవత్సలంను హొలగొంద నుంచి మంత్రాలయానికి, కుమార్‌సాయినాథ్‌ను ఓర్వకల్ నుంచి పత్తికొండకు, బి.మాధవశంకర్‌ను కోసిగి నుంచి ఆదోనికి బదిలీ చేశారు.
● ఐదుగురు జేఈలు, ఇద్దరు ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు కూడా బదిలీ అయ్యారు.
ఆర్‌యూ, కేయూల ఇన్‌చార్జ్ వీసీగా ప్రొఫెసర్ ఉమా
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీల ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ వి.ఉమా నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ జీవో ఆర్‌టీ నెం.56, 2025 జారీ చేసింది. రాయలసీమ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీగా, క్లస్టర్ యూనివర్సిటీకి ఇన్‌చార్జ్ వీసీగా ఉన్న ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోరడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయన 16 రోజుల పర్యటన ముగించుకొని వచ్చే వరకు తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ వి.ఉమాను రెండు వర్సిటీలకు ఇన్‌చార్జ్ వీసీగా వ్యవహరించనున్నారు.