
పత్రికా స్వేచ్ఛపై దాడి అనైతికం
● గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
రాజు నాయక్
గడివేముల: పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యవహరించడం అనైతికమని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ విమర్శించారు. సోమవారం గడివేముల మూల పెద్దమ్మ దర్శనానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల సాక్షి కార్యాలయంపై ఆమె దాడికి యత్నించడం సబబుకాదన్నారు. పత్రికలు, టీవీల్లో వ్యతిరేక కథనాలు రాస్తే దాడులు చేస్తామనే భయాన్ని జర్నలిస్టుల్లో కలిగించేందుకు ఆమె యత్నిస్తున్నారన్నారు. వాస్తవాలు రాసే మీడియాపై దాడులు ఎంతవరకు సమంజసమన్నారు. మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తే దానికి ఖండన కోరడం, లీగల్ నోటీసులు ఇవ్వాలనే కానీ.. గూండాగిరికి యత్నించడం సరికాదన్నారు. అఖిలప్రియ సాక్షి కార్యాలయంపై దాడిచేసేందుకు వస్తుంటే పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేయకుండా ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఇది పరోక్షంగా దాడికి సహకరించడమేనన్నారు.
కోలుకోలేక రిటైర్డ్ ఏఎస్‌ఐ మృతి
ఆదోని అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిటైర్డ్ ఏఎస్‌ఐ నారాయణమూర్తి(77) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. శనివారం ఆయన మాతా శిశు ఆసుపత్రి వద్ద వస్తుండగా బైకు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులోని దొంగలు పరార్?
● ఆలస్యంగా వెలుగులోకి..
పాణ్యం: విద్యుత్ తీగల దొంగలు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యారు. పట్టుబడిన దొంగలను వాహనంలో స్టేషన్‌కు తరలిస్తుండగా అదును చూసి తప్పించుకున్నారు. పాణ్యం పోలీసు స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్నాపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు విద్యుత్ తీగలు చోరీ చేసి విక్రయించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారిపై నిఘా పెట్టిన పోలీసులు ఆదివారం గ్రామానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిని జీపులో స్టేషన్‌కు తరలిస్తుండగా పాణ్యం సర్వీస్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్ ఉండటంతో వాహన వేగం తగ్గింది. ఆ క్రమంలో జీపులో ఉన్న దొంగలు వెంటనే దిగి పరుగులు తీశారు. అయితే ప్రధాన నిందితుడు పోలీసులు ఆదుపులో ఉన్నట్లు సమాచారం.

పత్రికా స్వేచ్ఛపై దాడి అనైతికం