
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ.3 కోట్లు స్వాహా
ఆదోని అర్బన్: ప్రభుత్వ భూమిని సొంత భూమి అంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వాటితో బ్యాంక్‌ను మోసం చేశారు. రూ.కోట్ల రుణం తీసుకుని చెల్లించకపోవడంతో అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.3.24 కోట్లు రుణం తీసుకున్న నలుగురిపై వన్‌టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. బ్యాంకు చైర్మన్ రాచోటి సుబ్బయ్య ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణానికి చెందిన యలే మల్లేశప్ప, యలే చెన్నబసప్ప, యలే చైత్ర ప్రభుత్వ స్థలాన్ని తమ సొంత స్థలమంటూ మూడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. బ్యాంకు సీఈఓ గట్టు మురళి సహకారంతో రూ.3.24 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే ఆ రుణాన్ని ఇంతవరకు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆ స్థలాన్ని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వ స్థలాన్ని వేలం ఎలా వేస్తారని ప్రభుత్వ ఉద్యోగులు అడ్డుకున్నారు. ల్యాండ్ డాక్యుమెంట్ డేటా తీయగా, ఆ మూడు డాక్యుమెంట్లు నకిలీవిగా తేలింది. బ్యాంకు చైర్మన్ రాచోటి సుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా.. బ్యాంకు సీఈఓ గట్టు మురళి పాత్ర వెలుగులోకి వచ్చింది. అతని సహకారంతో నకిలీ డాక్యుమెంట్లతో రూ.3.24 కోట్ల రుణాన్ని నిందితులు తీసుకున్నారు. తీసుకున్న రుణం చెల్లించగకుండా, బ్యాంక్‌ను మోసం చేసిన యలే మల్లేశప్ప, యలే చెన్నబసప్ప, యలే చైత్ర, వారికి సహకరించి రుణం ఇప్పించిన బ్యాంకు సీఈఓ గట్టు మురళిపై చీటింగ్, ఫోర్జరీ, తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ప్రభుత్వ భూమిని సొంత భూమిగా మార్చిన వైనం
ఆ పత్రాలతో అవ్వా బ్యాంకులో
రూ.3.24 కోట్ల రుణం
బ్యాంకు సీఈఓతో పాటు మరో
ముగ్గురిపై కేసు నమోదు