● ఎంగేజ్‌మెంట్‌కు ఒక రోజు ముందు ఘటన
ఎమ్మిగనూరురూరల్/పెద్దకడుబూరు: పెద్దకడుబూరు మండలం హెచ్.మురవణి గ్రామ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పట్టణంలోని వెంకటాపురం కాలనీకి చెందిన కె. రంగన్న, కె.జయమ్మకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు కె. వీరనాగన్న (26) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎటువంటి ఉపాధి లేకపోవటంతో పట్టణంలో హమాలీ పనికి వెళ్లేవాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసి ఇంటి మిద్దైపె పడుకోవటానికి వెళ్లాడు. సోమవారం ఉదయం కనిపించకపోవటంతో బయటకు వెళ్లాడేమో అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే వెంకటాపురం సమీపంలోని హెచ్.మురవణి పరిధిలోని తమ పొలంలో ఓ చెట్టు కింద వీరనాగన్న విగత జీవిగా పడి ఉన్నాడు. సమీపంలోని రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీనివాసులు వెంకటాపురానికి పోలీసులను పంపి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన సంఘటన స్థలం పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడుబూరు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మార్చురీలోని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కన పురుగు మందు డబ్బా ఉందని, శరీరంపై గాయాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరనాగన్నకు కోసిగి మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. మంగళవారం ఎంగేజ్‌మెంట్ జరగాల్సి ఉంది. ఇంతలోనే యువకుడు మృతి చెందటంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పెద్దకడుబూరు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.