
శుభగాత్రీ.. గిరిజాపుత్రి
● శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి
వార్షిక కుంభోత్సవం
● నాటి చెంచుల ఉత్సవం..
నేడు సకల జనుల వేడుక
● అమ్మవారి నిజరూపదర్శనంతో
పులకించనున్న భక్తజనం
● మల్లన్నకు అన్నాభిషేకం
నిజరూప దర్శనం..
ఎనిమిది చేతులలో వివిధ ఆయుధాలను ధరించి ఉన్న భ్రమరాంబాదేవి వారు రోజూ అలంకారమూర్తిగా దర్శనమిస్తారు. అమ్మవారికి స్వర్ణముఖకవచం అలంకరించి ఉంటుంది. అయితే సంవత్సరంలో ఒక్క కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారి ముఖానికి కవచాలంకరణ ఉండదు. ఆ రోజున భక్తులు అమ్మవారి నిజరూప దర్శనాన్ని చేసుకోవచ్చు. అమ్మవారి నిజరూప దర్శనముతో భక్తులందరూ పులకించిపోతారు. భక్తుల దర్శనాలు పూర్తయ్యాక రాత్రి 10 గంటల సమయంలో అమ్మవారికి పునఃపూజలు చేసి 9 రకాల పిండివంటలతో చేసే మహానివేదన చేయనున్నారు.
శ్రీశైలంటెంపుల్: అష్టాదశశక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబాదేవికి మంగళవారం వార్షిక కుంభోత్సవం నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. స్థానికులైన చెంచులకు అతి ముఖ్యమైన ఉత్సవం అమ్మవారి వార్షిక కుంభోత్సవం. చెంచుల ఆచారాలు, సంప్రదాయాలు నేడు కనుమరుగవుతుండగా, చెంచుల ఉత్సవం ఇప్పుడు సకల జనులందరి కుంభోత్సవంగా మారింది. 6వ శతాబ్దంలో సాక్షాత్తు ఆదిశంకరులే వామాచార (బలుల) సంప్రదాయానికి స్వస్తి చెబుతూ దక్షిణాచార (సాత్వికబలి) సంప్రదాయాన్ని కొనసాగేలా అమ్మవారి ఉగ్రరూపాన్ని ఉపసంహరించి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాలలో ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలో దాదాపు 2000 సంవత్సరం వరకు కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, కోటగోడ అమ్మవారి వద్ద కోళ్లు, మేకలను బలి ఇచ్చేవారు. అనంతర కాలంలో జంతు సంరక్షణ సమితితో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతుప్రేమికులు జంతు బలులను నిషేధించాలని విన్నవించారు. దీంతో దేవస్థానం పరిధిలో జంతు బలులు నిషేధిస్తూ దేవదాయ చట్టం రావడంతో కాలక్రమేణా సాత్వికబలి దిశగా ఈ కుంభోత్సవం చేరుకుంది. ప్రస్తుతం సాత్వికబలి ఇవ్వడం అనవాయితీగా మారింది. ఇందులో భాగంగా వేలకొద్ది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. దేవస్థానం వారితో పాటు స్థానికులు, వ్యాపారులు గ్రామం, ఊరు సుభిక్షంగా ఉండాలని కొరుకుంటూ వందల కేజీల అన్నం, పెసరపప్పుతో కూడిన కుంభాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు.
నేడు శ్రీశైల ఆలయంలో
పూజలు ఇలా..
కుంభోత్సవం రోజున అమ్మవారికి ప్రాతఃకాల పూజలు యథావిధిగా జరిపించబడతాయి. తరువాత అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ, అష్టోత్తరపూజలను, జపపారాయణలను చేస్తారు. అయితే సంప్రదాయాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంలో నిర్వహిస్తారు. కుంభోత్సవం కారణంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. సాయంత్రం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. కుంభోత్సవంలో భాగంగా సాయంత్రం స్వామివారి ప్రదోషకాల పూజల అనంతరం విశేషంగా అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని పూర్తిగా పెరుగన్నంతో కప్పివేస్తారు. స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి.
కాలానుగుణంగా మార్పు
సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, వ్యవహరాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. చెంచులు నాగరికత దిశగా అడుగులు వేయడంతో నాటి సంప్రదాయాలు, సంస్కృతి నేడు మనకు కనిపించడం లేదు. అలాగే గతంలో స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పాలుట్ల నుంచి ఓ యువతి దీపం తీసుకువచ్చేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఆచారం కనిపించడం లేదు. దీనికి బదులుగా స్వామివారి ఆలయంలో పనిచేస్తున్న వ్యక్తి మహిళా వేషధారణలో దీపంతో అమ్మవారి ఆలయానికి చేరుకుని కుంభహారతి ఇస్తారు. ఏడాదిలో 365 రోజులలో ఈ కుంభోత్సవం ఒక్క రోజు మాత్రమే అమ్మవారి మూలవిరాట్ దర్శనం భక్తులకు లభిస్తుంది. అయితే అమ్మవారు ఉగ్రరూపంలో ఉండడంతో కుంభహారతి ఇవ్వగానే భ్రమరాంబాదేవి మూలవిరాట్‌పై పసుపు, కుంకుమలను ఏకధాటిగా చల్లి అమె క్రోధ నేత్రాల చూపులు భక్తులపై ప్రసరింపజేయకుండా చేస్తారు.

శుభగాత్రీ.. గిరిజాపుత్రి

శుభగాత్రీ.. గిరిజాపుత్రి

శుభగాత్రీ.. గిరిజాపుత్రి

శుభగాత్రీ.. గిరిజాపుత్రి