
తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు
కర్నూలు: ఏపీ పొల్యూషన్ బోర్డు వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పి.ప్రశాంతి (10), 3వ తరగతి చదువుతున్న పి.ప్రదీప్ తప్పిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు గంట వ్యవధిలోనే వారి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామానికి చెందిన ప్రభుదాస్ కర్నూలు వీనస్ కాలనీలో ఉన్న బాలాజీ నివాస్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య మాధవి కూడా అక్కడే ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారిద్దరి పిల్లలు మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆడుకుంటూ బయటకు వెళ్లి తప్పిపోయారు. సమీపంలోని సాయిసదన్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే వారు లేకపోవడం, కింద చీకటిగా ఉండటంతో భయపడి మూడో అంతస్థులోనే ఉండిపోయారు. తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో వెంకటరమణ కాలనీలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న సీఐ నాగరాజరావు తన సిబ్బందితో చిన్నారులను వెతికిపట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సరదాగా ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేని స్థితిలో ఉన్న పిల్లల ఆచూకీ కనుగొని తల్లిదండ్రుల చెంతకు చేర్చినందుకు సీఐతో పాటు గస్తీ సిబ్బందిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.