
విద్యార్థుల చేతికి ట్యాబ్‌లు
డోన్ టౌన్: విద్యార్థుల నుంచి తీసుకున్న ట్యాబ్‌లను ఎట్టకేలకు తిరిగిచ్చేశారు. గత వైఎస్సార్‌సీసీ ప్రభుత్వం హయాంలో విద్యార్థుల భవిష్యత్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను అందించిన సంగతి తెలిసినదే. ఈనెల 1న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ స్థానిక ఏపీ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలోని విద్యార్థినుల నుంచి ట్యాబ్‌లు లాగేసుకున్నారు. ఈ విషయమై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్ద నరసనలు వ్యక్తం చేసినా ఎలాంటి స్పందన లేక పోవడంతో విషయం తెలుసుకున్న సాక్షి దినపత్రిక.. ‘ట్యాబ్‌లు లాగేసుకుంటున్నారు’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీంతో అధికారులు స్పందించారు. ఇంటెలిజెన్స్, విద్యాశాఖ అధికారులు విచారణ చేసి ట్యాబ్‌లు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. దీంతో బుధవారం హెచ్‌ఎం సుస్మితతో పాటు ట్యాబ్‌లు తీసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు ఫోన్ చేసి పాఠశాలకు పిలిపించి ట్యాబ్‌లు ఇచ్చేశారు.

విద్యార్థుల చేతికి ట్యాబ్‌లు