
పేదరికం.. అపహాస్యం!
పీ–4 ముసుగులో ప్రభుత్వం దగా
● ఎన్నికల హామీలను
విస్మరిస్తున్న నేతలు
● ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎత్తుగడ
● ప్రైవేటు చేతికి ప్రజల సమాచారం
● అత్యంత నిరుపేదలుగా
1.15 లక్షల కుటుంబాలు
కర్నూలు(అగ్రికల్చర్): 2024 ఎన్నికల సమయంలో అధికారమే లక్ష్యంగా ఇబ్బడిముబ్బడిగా హామీలను గుప్పించిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ప్రధాన హామీలు అమలు కాకుండానే సంవత్సరం గడుస్తోంది. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ చాపకింది నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదో చేస్తున్నారనే భ్రమ కల్పిస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీ–4 సర్వేను తెరపైకి తీసుకొచ్చారు. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్ట్‌న్‌ర్‌షిప్ పేరుతో పేదలకు ఏదో చేయబోతున్నట్లు హంగామా చేస్తున్నారు. పీ–4 కార్యక్రమం కింద ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, సంపన్నులు, సంస్థల ద్వారా పేదరిక నిర్మూలన చేస్తామంటూ ఇటీవల చంద్రబాబు చేస్తున్న హడావుడి చూసి ప్రజలు విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది.
1.15 లక్షల కుటుంబాలు ఎంపిక
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లాలో 5,40,248 కుటుంబాలను పీ–4 కోసం సర్వే చేశారు. ఇంట్లో టీవీ, ఫ్రిజ్, గ్యాస్, విద్యుత్ కనెక్షన్‌తో పాటు మంచినీటి కుళాయి, సొంత ఇల్లు లేని వారిని అత్యంత నిరుపేదలుగా పరిగణిస్తారు. నేడు గుడిసెల్లో నివాసం ఉన్నవారు కూడా టీవీ, గ్యాస్ వినియోగిస్తున్నారు. కరెంటు లేని ఇళ్లు దాదాపుగా కనిపించవు. అత్యంత నిరుపేదలుగా జిల్లాలో 1.15 లక్షల కుటుంబాలను గుర్తించారు. అట్టడుగున ఉన్న ఈ కుటుంబాలను కార్పొరేట్, ప్రైవేటు కంపెనీలు, అత్యంత సంపన్నులతో అనుసంధానం చేసి వారి ద్వారా దారిద్య్ర రేఖపైకి తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యం. ఈ సర్వే వివరాలను ప్రభుత్వమే ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు అప్పగిస్తోంది. పేదరిక నిర్మూలన అనేది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. కానీ కూటమి ప్రభుత్వం ఈ బాధ్యత నుంచి తప్పుకొని ప్రజల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వమే సేకరించి ప్రైవేటుకు అప్పగిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సామాజిక బాధ్యత
విస్మరించిన కంపెనీలు
పీ–4 కోసం జిల్లా యంత్రాంగం 14 కంపెనీలను ఎంపిక చేసింది. నిబంధనల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, పెద్దపెద్ద సంస్థలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వ ప్రమేయం లేకుండానే పేదరిక నిర్మూలనకు ముందుకు రావచ్చు. అయితే కొన్ని కంపెనీలు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించాయి. పన్నుల నుంచి మినహాయింపు పొందేందుకు కొన్ని సంస్థలు పిసరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్నాయి.
బంగారు కుటుంబాలుగా
మారుస్తారంట...
జిల్లాలో పూరెస్ట్ ఆఫ్ పూర్ కింద ఎంపిక చేసిన 1.15 లక్షల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మారుస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ కుటుంబాల్లోని సభ్యులు దాదాపు జిల్లాలో దాతలుగా ఎంపిక చేసిన కంపెనీలు, సంస్థలు తదితరుల వద్ద పని చేస్తున్న వారే కావడం గమనార్హం. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలను అమలు చేస్తే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. కానీ వీటిని పూర్తిగా పక్కన పెట్టిన పీ–4 ముసుగులో ప్రయివేటును తెరపైకి తీసుకొస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లు ప్రకటించిన విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేసింది. ఈ పథకాల వల్ల పేదరికం గణనీయంగా తగ్గింది. అయితే ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు అధికారం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా ఇస్తామని ప్రజలను నమ్మించారు. ఇందులో భాగమే సూపర్–6 హామీ. అధికారంలోకి రాగానే ఈ పథకాలను కూటమి ప్రభుత్వం గంగలో కలిపేసింది. అయితే ప్రజల దృష్టి మరల్చేందుకు పేదరిక నిర్మూలన పేరిట హడావుడి చేస్తుండటం గమనార్హం.
కూటమి ప్రభుత్వం విస్మరించిన ప్రధాన హామీలు కొన్ని..
● అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి
రూ.20వేలు.
● అడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు
రూ.1,500.
● తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు
ఉంటే అందరికీ ఏడాదికి రూ.15వేలు.
● ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.3వేల
నిరుద్యోగ భృతి.
● మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
● 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనార్టీలకు వృద్ధాప్య పింఛను.
జిల్లాలో ఎంపిక చేసిన కంపెనీలు
రాయలసీమ ఆల్కాలీస్ కెమికల్స్
రాయలసీమ హై స్ట్రెంత్ హైపో లిమిటెడ్
రాయలసీమ గ్రీన్ స్టెల్లో ఇండస్ట్రీస్
మారుతి ఇస్పాత్ ఎనర్జీ లిమిటెడ్
అదాని విల్‌మార్ ప్రైవేటు లిమిటెడ్
ప్రెస్‌బౌల్ హార్టికల్చర్
జయరాజ్ ఇస్పాత్ లిమిటెడ్
సిగాచి ఇండరిస్టీస్ లిమిటెడ్
జియో మైసూర్ సర్వీస్
గ్రీన్‌కో ఐఆర్‌ఈపీ
చాంబర్ ఆఫ్ కామర్స్
క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్
ఇండస్ట్రియల్ ఎస్టేట్ అసోసియేషన్
రైస్ మిల్స్ అసోసియేషన్