
తల్లి మందలించిందని ఆత్మహత్య
ఆదోని అర్బన్: స్థానిక క్రాంతినగర్‌కు చెందిన ఉరుకుందప్ప కుమార్తె ఇందూ (20) తల్లి మందలించడంతో ఇంట్లో నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఔట్‌పోస్టు కానిస్టేబుల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందూ ఇంట్లో సెల్‌ఫోన్ చూస్తుండటంతో తల్లి స్వాతి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు మంటలు ఆర్పి చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే యువతి మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఔట్‌పోస్టు కానిస్టేబుల్ తెలిపారు.
యువకుడి అదృశ్యం
ఆదోని అర్బన్: పట్టణంలోని శివశంకర్‌నగర్ కాలనీకి చెందిన రామాంజనేయులు, మహాలక్ష్మి దంపతుల కుమారుడు అభిరామ్ ఆదివారం నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఉపాధ్యాయుడైన తండ్రి రామాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం అభిరామ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడని రాత్రయినా తిరిగి రాకపోవడంతో స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి విచారించినా ఆచూకీ తెలియలేదన్నారు. రాత్రి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. అభిరామ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడన్నారు.
సంగమేశ్వరాలయానికి విద్యుత్ సౌకర్యం
కొత్తపల్లి: మండలంలోని సప్తనది సంగమేశ్వరాలయం కృష్ణాజలాల నుంచి పూర్తిగా బయటపడింది. దీంతో ఆలయంలో భక్తుల పూజలు మొదలయ్యాయి. ఆలయంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ విద్యుత్ శాఖ వారితో మాట్లాడి ఎగువ నుంచి ప్రాచీన ఆలయానికి సోమవారం విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పాయి. గర్భాలయంలో, ముఖ మండపంలో, ఆలయ ప్రాంగణంలో విద్యుత్ సౌకర్యం కల్పించారు.