
నేషనల్ డేటా బేస్‌లో కార్మికుల నమోదు
కర్నూలు(అర్బన్): రాష్ట్రవ్యాప్తంగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను నేషనల్ డేటా బేస్‌లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సంయుక్త కార్మిక కమిషనర్ ఎం.బాలునాయక్ చెప్పారు. ఈ – శ్రమ్ పోర్టల్‌లో ప్లాట్ ఫాం, గిగ్ కార్మికుల పేర్లను నమోదు చేసే కార్యక్రమానికి సంబంధించి సోమవారం నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక వెంకటరమణ కాలనీలోని బిగ్ బాస్కెట్ కార్మికుల నమోదు ప్రక్రియ కార్యక్రమంలో జాయింట్ లేబర్ కమిషనర్ బాలునాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అసంఘటిత రంగాల్లోని కార్మికులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ– శ్రమ్ పోర్టల్ వేదికను రూపొందించిందన్నారు. ఆధార్‌కార్డు, 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, ఈఎస్‌ఐ, పీఎఫ్ నమోదు కాని వారు ఈ పోర్టల్‌లో నమోదు కావాలని సూచించారు. సీఎస్‌సీ, గ్రామ/వార్డు సచివాలయాలు, సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయాల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కేశన్న తదితరులు పాల్గొన్నారు.