
గజ వాహనంపై రంగనాథుడు
జూపాడుబంగ్లా: తర్తూరు శ్రీ లక్ష్మీరంగనాథుడు స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి మూల విగ్రహానికి, ఉత్సవ విగ్రహానికి అర్చకులు పంచామృతాభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన వంటి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం చెక్కబొమ్మ రూపంలో ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహానికి పన్నీటితో స్నానం చేయించి వెండితొడుగు పట్టువస్త్రాలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తిని గజవాహనంతో అలంకరించిన గ్రామోత్సవం నిర్వహించారు. తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామి రథోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.