
దోపిడీకి ‘టెంకాయ’ కొట్టారు
జూపాడుబంగ్లా: తర్తూరు జాతరలో టెంకాయల విక్రయ దారుడు భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నాడు. వేలం పాటలో నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈనెల ఒకటోవ తేదీన ఆలయ తాత్కాలిక కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి అధ్వర్యంలో టెంకాయలు, లడ్డూ, కొబ్బరి చిప్పల వేలం పాటలు నిర్వహించారు. పెద్దసైజు టెంకాయ ఒకటి రూ.30 చొప్పున విక్రయించాలని ముందుగానే వేలం పాటదారులకు టెంకాయసైజు చూపించి వేలం పాటలు నిర్వహించారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన రాజేష్ రూ.5.90 లక్షలకు పాట దక్కించుకున్నాడు. ఈనెల 6 నుంచి 20వ తేదీ వరకు టెంకాయలు విక్రయించేలా నిర్ణయించారు. విక్రయాల్లో కుళ్లిన కొబ్బరికాయకు మరో కాయ భక్తులకు ఇవ్వాలని, చిన్నసైజు టెంకాయలు అధిక ధరలకు విక్రయించరాదనే నిబంధనలు విధించారు. నిబంధనలను అతిక్రమిస్తే వేలం పాట రద్దు చేసి చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వమని తేల్చి చెప్పారు. అయినా నిబంధనలు పట్టించుకోకుండా చిన్న సైజ్ టెంకాయలను రూ. 35కు విక్రయిస్తున్నాడు. టెంకాయ కుళ్లిపోతే మరో టెంకాయ ఇవ్వకుండా, అధికధరలకు టెంకాయలు విక్రయిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నాడు. భక్తులు ఫిర్యాదు చేసినా ఆలయ అధికారు లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
తర్తూరులో కొబ్బరి కాయల విక్రయాల్లో నిబంధనలు బేఖాతర్
చిన్న సైజ్ కాయలు అధిక ధరకు విక్రయం