వెల్దుర్తి: ఊరంటే ఎనలేని ప్రేమ.. హద్దులులేని అభిమానం.. అక్కడే పెరిగారు.. అందరితో ఆత్మీయంగా ఉండేవారు. అదే పల్లెలో ఎన్నో ఏళ్లుగా జీవనం.. అందరూ తెలిసిన వారే.. అయితే గతేడాది జరిగిన ఒక హత్య ఎనలేని కష్టాలను తెచ్చింది. గ్రామస్తుల ప్రమేయం లేకున్నా టీడీపీ నాయకులు కక్ష గట్టారు. పలు కుటుంబాలను గ్రామం నుంచి వెళ్లగొట్టారు. ఊరు వదిలిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు హైకోర్టు ఆదేశాలతో 32 మందిలో 27మంది ఈనెల 7న తిరిగి గ్రామం చేరుకున్నారు. మిగిలిన ఐదుగురు సైతం మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య గ్రామానికి వచ్చారు.
ఇదీ ఘటన..
వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో జూన్ 9న టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరి హత్య జరిగింది. కేసులో దాదాపు 11మంది వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల పేర్లను అక్రమంగా చేర్చారు. కేసులో ముద్దాయిలతోపాటు, సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామంలోని పలు కుటుంబాలను టీడీపీ నాయకులు గ్రామం నుంచి వెళ్లగొట్టారు. శాంతిభద్రతల పేరుతో వారికి పోలీసులు వంతపాడారు. ఈ దశలో కేసులో ముద్దాయిలు 11మందితోపాటు ఊరు విడిచి వెళ్లిన వారు మొత్తంగా 32మంది తమను తిరిగి గ్రామం చేర్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జస్టిస్ హరినాథ్.. పిటిషనర్లు గ్రామంలోకి వెళ్లేలా అనుమతించాలని గత నెల తీర్పునిచ్చారు. దీంతో పోలీసులు ఈనెల 7వ తేదీన 32మందిని గ్రామంలోకి చేరుకునేలా ప్రయత్నించారు. ఆ సమయంలో పరిస్థితుల నేపథ్యంలో 27మందికి మాత్రమే అనుమతినివ్వడంతో మిగిలిన ఐదుగురు వెనుదిరిగారు. ఈ పరిస్థితులను అన్నీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్షిస్తూ వచ్చారు. గ్రామంలో రెండు దఫాలుగా పర్యటించారు. ఈ క్రమంలో మిగిలిన ఐదుగురు సైతం మంగళవారం పోలీస్ బందోబస్తు మధ్య గ్రామం చేరుకున్నారు. వీరిలో భాస్కర్ నాయుడు, రంగయ్య సోదరులు, సూర్యనారాయణ, వెంకటేశ్, రాజేశ్ ఉన్నారు. పది నెలల అనంతరం వారు ఇంటికి చేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రశాంతతకు పోలీసులు పికెట్ నిర్వహిస్తూనే ఉన్నారు.
పది నెలల తర్వాత తెరపడిన నిరీక్షణ
బొమ్మిరెడ్డిపల్లె చేరుకున్న గ్రామస్తులు
ఊరికి చేరి.. ఊపిరి పీల్చి!