
క్రీడలతో పాటు వ్యాయామం తప్పనిసరి
● రేంజ్ పోలీసుల క్రీడా పోటీల్లో ఏఆర్ అడిషనల్ ఎస్పీ
కర్నూలు: పోలీసు సిబ్బందికి క్రీడలు, వ్యాయామం చాలా అవసరమని, వీటి ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ అన్నారు. కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల (రేంజ్ పరిధిలో) పోలీసులకు కర్నూలు నగరంలోని ఔట్‌డోర్ స్టేడియంలో మంగళవారం క్రీడల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. కర్నూలు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో క్రీడాపోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న పోలీసు సిబ్బందికి అవకాశం కల్పించారు. ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, షటిల్, రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్, క్రికెట్, బాస్కెట్ బాల్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాపోటీలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రేంజ్ పరిధిలో క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన పోలీసులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ భాస్కర్‌రావు, ఆర్‌ఐలు, రేంజ్ పరిధిలోని వివిధ జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది పోటీల్లో పాల్గొన్నారు.