
మత్స్యకారులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులను తీవ్రంగా మోసం చేస్తున్నదని జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బెస్త శ్రీనివాసులు తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాలకు మత్స్యకార భరోసా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేది వరకు 61 రోజుల పాటు రాష్ట్రంలో చేపల వేట జరగకుండా వెయిటర్ నిషేధం విధించిన సమయంలో రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ భృతి చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే ఇంగ్లాండ్ చెరువులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో భృతి చెల్లించకపోవడం దారుణమన్నారు. రాయలసీమలోని మత్స్యకార సొసైటీలు కూడా చేపల పెంపకానికి చెరువులకు పన్ను చెల్లిస్తున్నప్పుడు మత్స్యకార భరోసాకు వారు ఎందుకు అర్హులు కారని ప్రశ్నించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని విడనాడి అందరికీ న్యాయం చేయాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు రాజకీయంగా పెద్ద పీట వేశారని, ఒక రాజ్యసభ, ఒక మంత్రి, నాలుగు ఎమ్మెల్సీలు, నాలుగు పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు, బ్యాంకు చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు తదితర అనేక పదవులు ఇచ్చారని శ్రీనివాసులు గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తు ప్రాంతాల వారీగా మత్స్యకారులను విడదీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటి వరకు మత్స్యకారులను కూటమి ప్రభుత్వం గుర్తించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికై నా సంప్రదాయ మత్స్యకారులు చంద్రబాబు కుటిల రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో నాయకులు బెస్త సత్యనారాయణ, ఎద్దుల వెంకటేశ్వర్లు, బెస్త కమల, తెలుగు కన్నా, నంద కిషోర్, మోహన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బెస్త శ్రీనివాసులు