
పిడుగు పడి రెండు ఎద్దులు మృతి
పెద్దకడబూరు: మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో ఆదివారం పిడుగు పడి చిన్న మాదన్న అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. బాధిత రైతు, స్థానికుల వివరాల మేరకు.. చిన్న మాదన్న ఎప్పటి లాగే (గ్రామానికి సమీపంలో ఉన్న) పొలానికి తీసుకెళ్లి అక్కడ ఎద్దులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. మధ్నాహ్నం వాటిపై పిడుగు పడటంతో మృతి చెందాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి బాధిత రైతుకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు వెళ్లి విగతజీవులుగా పడిఉన్న ఎద్దులను చూసి బోరున విలపించారు. దాదాపు రూ. 1.80లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు చిన్న మాదన్న వాపోయాడు. కష్టం చేసుకుని బతికే తమకు రెండు ఎద్దులు చనిపోవడంతో చేతులు విరిగినట్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.