
హంతకులను తక్షణమే అరెస్టు చేయాలి
● సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి
కర్నూలు(సెంట్రల్): ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను ఎన్.రఘువీరారెడ్డితో పాటు కర్నూలు జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి అంబటి రామకృష్ణ యాదవ్ ఫోన్‌లో మాట్లాడి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పరిపాలనాధికారిగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ జిల్లాల పునర్విభజనలో నంద్యాలకు వెళ్లిన జీఎన్‌ఏ ప్రసాద్‌కు పరిపాలనాధికారిగా పదోన్నతి లభించింది. జోన్–4లో జరిగిన పదోన్నతుల్లో భాగంగా ప్రసాద్‌ను శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ డీఎల్‌పీఓ కార్యాలయానికి పోస్టింగ్ ఇస్తూ పీఆర్‌అండ్‌ఆర్‌డీ డైరెక్టర్ వీఆర్ క్రిష్ణతేజ మైలవరపు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాద్‌కు పరిపాలనాధికారిగా పదోన్నతి లభించడంపై జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ ఉద్యోగులు, సహచరులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రేషన్ బియ్యం పట్టివేత
గోస్పాడు: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గోస్పాడు ఎస్‌ఐ వెంకటప్రసాద్ పట్టుకున్నారు. బియ్యం బస్తాలతో బనగానపల్లె వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని మండలంలోని రాయపాడు గ్రామ సమీపంలో గుర్తించి తనిఖీలు చేపట్టారు. మొత్తం 16 బస్తాల బియ్యం ఉండటంతో ఆ వాహనాన్ని సీజ్ చేసి బనగానపల్లెకు చెందిన వంశీ, హుసేని, గిరి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉరుముల శబ్దానికి వృద్ధుడి మృతి
ప్యాపిలి: పట్టణంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పట్టణంలోని బాలికల వసతి గృహం సమీపంలో నివాసం ఉంటున్న మసాలా బాషా సాహెబ్ (70) ఇంటి వసారాలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా ఉరుముల శబ్దం వచ్చింది. ఉరుముల శబ్దంతో గుండెపోటుకు గురైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎర్రమట్టి ట్రాక్టర్ల పట్టివేత
సి.బెళగల్: మండల కేంద్రం సి.బెళగల్లో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి మండలంలోని గ్రామాల్లో వారు గస్తీ నిర్వహిస్తుండా నిషిద్ధ ప్రాంతమైన సి.బెళగల్ పచ్చిక బయళ్లు ఉన్న కొండ నుంచి ఎర్రమట్టిని తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు కనబడ్డాయి. వాటిన సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతి లేకుండా ఎర్రమట్టి తరలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

హంతకులను తక్షణమే అరెస్టు చేయాలి