మహబూబాబాద్: లోన్ పేరిట ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు ఆమె భర్త, కూతురు, మరో ఇద్దరు మోసం చేశారని, వీరిపై ఎస్పీ కరుణాకర్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు శనివారం తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం మహాముత్తారం మండలం మాదారానికి చెందిన పెరుమాండ్ల పోశమ్మ కాటారం మండల మేడిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తోంది. పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలు, ఆమె భర్త పదే పదే బ్యాంక్‌లోన్ కావాలా అని అడేగేవారు.
దీంతో రూ.2లక్షల లోన్ ఇప్పించమని కోరింది. ఈ క్రమంలో సదరు ఉద్యోగి భర్త మంథనికి తీసుకెళ్లి ధ్రువపత్రాలపై సంతకాలు తీసుకున్నారు. వారం తర్వాత గోదావరిఖని ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా రూ.6 లక్షల రుణం మంజూరైనట్లు తెలిపారు. బ్యాంక్ ద్వారా రూ.3 లక్షలు విత్‌డ్రా చేసుకోగా, మరో 3 లక్షలు అకౌంట్‌లో లేవు. దీనిపై సదరు ఉద్యోగి భర్తను నిలదీయగా తనకు సంబంధం లేదని చెప్పారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సమస్య తలెత్తుతుందని బెదిరించడంతో మిన్నుండిపోయింది.
ఈ క్రమంలో 15 రోజుల క్రితం లోన్ ఈఎంఐ చెల్లించడం లేదని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు ఇంటికి రాగా విషయం బయటపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.6లక్షలతో పాటు బాధితురాలికి తెలియకుండా తన పేరిట సదరు ఉద్యోగి, ఆమె భర్త, తన కూతురు, మరో ఇద్దరు కాటారం ఎస్బీఐలో రూ.14 లక్షల లోన్ తీసుకున్నారు. బాధితురాలి చెక్కులను చోరీ చేసి లోన్ డబ్బును బ్యాంక్ నుంచి డ్రా చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోశమ్మ కోరారు. ఈ విషయమై కాటారం ఎస్బీఐ మేనేజర్ వెంకట్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా పోశమ్మకు తమ బ్యాంక్‌లో ఎలాంటి లోన్ లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment