విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాలి
నెహ్రూసెంటర్: పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన శస్త్రచికిత్సలు చేసి అద్దాలు అందిస్తామని డీఎంహెచ్‌ఓ మురళీధర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లోని డైక్ సెంటర్‌లో సోమవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కంటి సమస్యలున్న 970 మంది విద్యార్థులను గుర్తించామని, వారిని మరోసారి పరీక్షించామని చెప్పారు. కంటిచూపు సమస్య ఉన్న వారికి శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య, ఆశకార్యకర్తలు, వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ వెంకట్రాములు, మెడికల్ కళాశాల ప్రిన్సి పాల్ వెంకట్,డాక్టర్ కుమార్,డాక్టర్ శ్రీధర్, డా క్టర్ రాణాప్రతాప్, డాక్టర్ హర్షవర్ధన్, ఆఫ్తాలమిక్ ఆఫీసర్స్ సుబ్బలక్ష్మి, బాలాజీ, కృష్ణ, ఎస్ యూఓ రామకృష్ణ, జోత్స్న, రాజ్‌కుమార్, డైక్ మేనేజర్ యజ్ఞేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే గేటు మూసివేత
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పోలీసు క్వార్టర్స్ వద్దగల రైల్వే గేటును మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు మూసివేస్తారని సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా ఎల్‌సీ 80 (ఏ క్యాబిన్) రైల్వే గేటును మూసివేస్తారని, మంగళవారం అర్ధరాత్రి 2గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రజలు, వాహనదారులు పోలీసు క్వార్టర్స్ వద్దగల రైల్వే గేటు మీదుగా కాకుండా ఇతర మార్గాల నుంచి రాకపోకలు కొనసాగించాలని సూచించారు.
వందశాతం ఫలితాలు రావాలి
తొర్రూరు: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత పొందాలని డీఈఓ రవీందర్‌రెడ్డి కోరారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని కస్తూర్బా స్కూల్‌ను డీఈఓతోపాటు మండల విద్యాశాఖ అధికారులు సందర్శించి, రోజు అందిస్తున్న భోజనం తీరు, విద్యార్థులకు అందిస్తున్న బోధనపై ఆరా తీశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అన్నిరకాల వసతులను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, స్కూల్ ఎస్‌ఓ శైలాజ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఆలయ ప్రతిష్ఠాపన
మహోత్సవం
కురవి: మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో సోమవారం సీతారామచంద్రస్వామి నూతన ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితుడు కండ్లకుంట వేంకట నృసింహచార్యస్వామి మంత్రోచ్ఛరణల నడు మ నిత్య హోమాలు, మహాపూర్ణాహుతి యంత్ర స్థాపన, శిఖర, విమాన, గోపుర కలశ, బింబ(విగ్రహ) ప్రతిష్ఠలు వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి, మాలోత్ నెహ్రూనాయక్, మార్కెట్ చైర్మన్ సుధాకర్, పార్టీల నాయకులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
108 వాహనంలో ట్యాబ్ చోరీ
కొత్తగూడ: మండలంలో 108వాహనంలో ఉన్న ట్యాబ్(సెల్ ఫోన్)ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఎస్సై కుశకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం 108 వాహనం నర్సంపేట ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుంది. ఈ క్రమంలో గాదె వాగు సమీపంలో వాహనం ఆపి సిబ్బంది బహిర్భూమికి వెళ్లారు. ఇది గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలోని ట్యాబ్‌ను చోరీ చేశారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాలి
Comments
Please login to add a commentAdd a comment