అందని హెల్త్ కిట్లు
గూడూరు: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా గత ప్రభుత్వం శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్ల పంపిణీ ప్రారంభించింది. 2018–19 సంవత్సరంలో కిట్ల పంపిణీ ప్రారంభించగా.. మూడు నెలలకోసారి సంవత్సరానికి నాలుగుసార్లు కిట్లు అందించారు. ఆ తర్వాత పంపిణీ నిలిచిపోయింది. నాలుగేళ్లుగా కిట్లు అందజేయకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థినుల ఆరోగ్యంపై దృష్టిసారించి కిట్లు అందజేయాలని కోరుతున్నారు.
8, 9,10వ తరగతుల నుంచి..
గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే 8, 9, 10వ తరగతి బాలికలతో పాటు ఇంటర్ విద్యార్థినులకు శానిటరీ, న్యాప్కిన్స్, సబ్బులు, కొబ్బరినూనె, షాంపు బాటిల్, టూత్ పేస్ట్, బ్రష్, పౌడర్ వంటి 15 రకాల వస్తువులతో కూడిన హెల్త్‌కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఏడాదిన్నర కాలం పాటు సజావుగా కిట్లు అందజేశారు. ఆ సమయంలో కరోనాతో పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. అప్పటి నుంచి నేటికీ పంపిణీని పునరుద్ధరించలేదు.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని 16 కేజీబీవీల్లో 8వ తరగతి విద్యార్థినులు 641 మంది, 9వ తరగతి విద్యార్థినులు 531 మంది, 10 వ తరగతి విద్యార్థినులు 496 మంది చదువుతున్నారు. అలాగే 251 మంది విద్యార్థినులు ఇంటర్ ఫస్టియర్, 255మంది విద్యార్థినులు సెకండియర్ చదువుతున్నారు. అదే విధంగా 22 టీడబ్ల్యూఏహెచ్‌ఎస్‌లు ఉన్నాయి. వాటిల్లో 455మంది విద్యార్థినులు 8వ తరగతి, 479మంది 9వ తరగతి, 467 మంది పదో తరగతి చదువుతున్నారు. జిల్లాలో 87 జెడ్పీహెచ్‌ఎస్‌లు ఉండగా.. 8వ తరగతిలో 774మంది, 9వ తరగతిలో 862 మంది, 10వ తరగతిలో 840 మంది విద్యార్థినులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 6,051మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఇప్పటికై నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తిరిగి కిట్లు అందించి, బాలికల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో నిలిచిన హైజెనిక్ కిట్ల పంపిణీ
బాలికల ఆరోగ్యంపై
శ్రద్ధ చూపని ప్రభుత్వం
కిట్లు అందజేయాలని
తల్లిదండ్రుల వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment