కూరగాయల సాగుతో రైతులకు మేలు
మహబూబాబాద్ రూరల్: రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయల పంటలు, పూల తోటలను సాగుచేసి నికర ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. కూరగాయల సాగుపై జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. వేసవిలో కూరగాయల సాగు చేపట్టి రైతులు లాభం పొందాలన్నారు. జిల్లాలో రెండు సీజన్లలో కలిపి రైతులు 2,537 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం టమాట, వంగ, గోరు చిక్కుడు, బెండ, దోస, సోర, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా తదితర కూరగాయల సాగువల్ల లాభం వస్తుందని సూచించారు. ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగుచేసి నాణ్యమైన దిగుబడులు సాధించాలన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా కూరగాయలు సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి రూ.2,100 రాయితీ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓలు తిరుపతిరెడ్డి, రాజు, రాంబాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment