ఆకట్టుకున్న సాంస్కృతిక ఉత్సవం
● ప్రతిబింబించిన తెలంగాణ,
కేరళ రాష్ట్రాల సంస్కృతి
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ, కేరళ రాష్ట్రాల సాంస్కృతిక ఉత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్చేంజ్ ప్రోగ్రాంలు జరుపుతున్నారు. కేరళకు చెందిన కళారూపాలు కొల్కలి, ముటిపాటు, తిరువతిర తదితర సంప్రదాయ జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాల విశిష్టతను తెలియజేస్తూ యువతులు ప్రదర్శనలిచ్చారు. జన్ను భరత్, భాస్కర్ సారథ్యంలో డప్పులతో ప్రదర్శన, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వారి బతుకమ్మ, పింగిళి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల బోనాలు, పోతురాజు, హనుమకొండ వాగ్దేవి కాలేజీ విద్యార్థి అమ్మవారి వేషధారణ, కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వరంగల్ నెహ్రూ యువ కేంద్ర, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించారు. స్పాన్సర్లుగా కూరపాటి హాస్పిటల్స్, లయన్స్ ఇంటర్నేషనల్ 320 ఎఫ్, అభయ హాస్పిటల్స్, ముక్తి లేజర్ ఫైల్స్ క్లినిక్ వ్యవహరించాయి. కేయూ ప్రొఫెసర్ మల్లారెడ్డి, డాక్టర్ కూరపాటి రమేశ్, డాక్టర్ గౌతమ్, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేశ్ చింతం, వరంగల్ జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ వసుధ, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొని కళాకారులకు బహుమతులు ప్రశంసపత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment