మరింత ఆలస్యం!
సాక్షి, మహబూబాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. వచ్చిన దరఖాస్తులు, అర్హుల జాబితాను మూడు విభాగాలుగా విభజించి ఇళ్లు మంజూరు చేసేందుకు జిల్లా యంత్రాంగం కుస్తీ పడుతోంది. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ముగ్గులు పోసే కార్యక్రమాల్లో గృహ నిర్మాణశాఖ నిమగ్నమై ఉండగా.. మహబూబా బాద్‌లో మాత్రం తుది జాబితా ఎంపిక పూర్తి కాలేదని తెలుస్తోంది.
మూడు భాగాలుగా విభజన..
ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో 1,89,065 దరఖాస్తులు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 28,526 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 2,17,591 దరఖాస్తులు వచ్చాయి. వీటిని మండలాలు, గ్రామాల వారీగా విభజించి టీమ్ సభ్యులు ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ద్వారా ఆధార్ కార్డు, రేషన్ కార్డు నంబర్లు సరిచూసుకుంటూ... సొంత స్థలం ఉందా.. ఇల్లు ఉందా ..ఉంటే ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు.. అద్దె ఇంట్లో ఉంటున్నారా.. మొదలైన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడే ఇంటి యజమాని, ఇల్లు ఫొటో తీసి అప్‌లోడ్ చేశారు. ఈ మేరకు లబ్ధిదారుల జాబితాను తయారు చేశారు. అయితే ముందుగా విడుదల చేసిన జాబితాలో అర్హుల పేర్లు లేవని పలు గ్రామాల్లో ఆందోళనలు జరిగాయి. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా ఒక్క ఇందిరమ్మ ఇళ్ల కోసమే 30,116 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హుల జాబితాను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి జాబితాలో ఇంట స్థలం ఉండి, ఇల్లు లేని వారికి ఇవ్వడం, రెండో జాబితాలో ఇల్లు, స్థలం లేకుండా ఉన్నవారికి, మూడో విడతలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న వారికి కొత్త ఇల్లు మంజూరు చేసేలా విభజించారు.
ముగ్గు పోసేందుకు ముహూర్తం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ప్రభుత్వ పెద్దలు చెబుతుండగా..జిల్లాలో మాత్రం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ప్రతీ మండలంలో ఒక మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టేందుకు ముగ్గుపోశారు. పలుచోట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ముందుగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి నిర్మాణాల కోసం ముగ్గులు పోయాలి. అయితే గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతోంది. మహిళల పేరున ఇల్లు మంజూరు, రేషన్ కార్డు తప్పనిసరి, ఫోన్ నంబర్, బ్యాంకు అకౌంట్ లింక్ కావడం మొదలైన అంశాల్లో తేడాలు ఉండడంతో జాబితా ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇతర జిల్లాల్లో ముగ్గులు పోసి నిర్మాణాలు చేపడుతుండగా ఇక్కడ మాత్రం జాబితా తయారీతోనే కుస్తీ పట్టడంతో ఎప్పుడు జాబితా ప్రకటిస్తారో.. ఎప్పుడు ముగ్గులు పోస్తారో అని నిరుపేదలు ఎదురుచూస్తున్నారు.
త్వరలో ముగ్గులు పోస్తాం..
మండల కేంద్రంలో మోడల్ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 18 మండలాల్లో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశాం. ఆయా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడమే లక్ష్యంగా తుది జాబితా తయారు చేస్తున్నాం. త్వరలో అర్హుల జాబితా ప్రకటనతో పాటు ముహూర్తం చూసి ముగ్గులు పోసే కార్యక్రమం కూడా చేపడుతాం.
– కె. రాజయ్య, పీడీ, గృహనిర్మాణ శాఖ
రెండో జాబితా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు..
ఇల్లు, ఇంటి స్థలం లేనివారికి గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రకటించడంతో నిరుపేదలు ఆ జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 5,415 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే ఇందులో ఇప్పటి వరకు 2,773 ఇళ్లు పూర్తికాగా.. 1,798 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించారు. ఇందులో 1,728 కుటుంబాలు ఇళ్లలోకి వెళ్లగా.. నిర్మాణం పూర్తయిన 975 ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. బేస్‌మెంట్, స్లాబ్ లెవల్, ప్లాస్టింగ్ స్టేజీ ఇలా వివిధ దశల్లో 2,642 ఇళ్లు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ ఇళ్లు పూర్తయితేనే రెండో జాబితాలో ఉన్నవారికి కేటాయించే అవకాశం ఉంది. అయితే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించకుండా ఉన్న గ్రామాల్లోని నిరుపేదల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జాప్యం
మూడు విడతల్లో కేటాయింపు
మండలంలో మోడల్ హౌస్ నిర్మాణం
మండలానికో గ్రామం ఎంపిక
ముగ్గులు పోసేందుకు
ఫిక్స్‌కాని ముహూర్తం
మరింత ఆలస్యం!
Comments
Please login to add a commentAdd a comment