లైంగికదాడి కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు
కాటారం: బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి నారాయణబాబు మంగళవారం తీర్పు వెలువరించినట్లు మహాముత్తారం ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం కనుకునూరు గ్రామానికి చెందిన అట్టెం మల్లయ్య 2019లో మండలానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రాము.. మల్లయ్యపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా అప్పటి సీఐ శివప్రసాద్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత సీఐ హథీరాం మరికొందరు సాక్షులను విచారించగా కాటారం డీఎస్పీగా ఉన్న ప్రస్తుత భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ కోర్టులో చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కొన్ని రోజులుగా కోర్టులో విచారణ కొనసాగగా డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునారావు, ఎస్సై మహేందర్‌కుమార్ ఆధ్వర్యంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా జిల్లా కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్‌రావు వాదనలు వినిపించగా నేరం రుజువైంది. దీంతో మల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నారాయణబాబు తీర్పు వెలువరించారు. కాగా, నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు కోర్టు లైజనింగ్ ఆఫీసర్, ఏఎస్సై వెంకన్న, కోర్టు కానిస్టేబుల్ రమేశ్‌ను ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment