సీఏ ఫలితాల్లో సిరిసహస్రకు ఆలిండియా 35వ ర్యాంకు
కమలాపూర్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మంగళవారం విడుదల చేసిన సీఏ ఇంటర్మీడియట్ కోర్సు ఫలితాల్లో హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన చేరాల సిరిసహస్ర ఆలిండియా 35వ ర్యాంకు సాధించింది. చేరాల రాజ్‌కుమార్, సరస్వతి దంపతుల కూతురు సిరిసహస్ర హైదరాబాద్‌లోని చాంప్స్ సీఏ అకాడమీ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతూ సీఏ ఇంటర్మీడియట్ రెండో సెమ్ చదువుతోంది. గ్రూప్–1 లో 216 మార్కులు, గ్రూప్–2లో 246 మార్కులు సాధించిన సిరిసహస్ర మొత్తం 462 మార్కులతో ఆలిండియా 35వ ర్యాంకు సాధించింది. దీంతో సిరిసహస్రను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు గ్రామస్తులు అభినందించారు.
రేపు కాజీపేట మీదుగా వన్‌వే స్పెషల్ ట్రైన్
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బనారస్–సికింద్రాబాద్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్‌ను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. బనారస్‌లో బుధవారం బయలుదేరే బనారస్–సికింద్రాబాద్ (05082) వన్ వే స్పెషల్ ట్రైన్ మరుసటి రోజు (గురువారం) కాజీపేట జంక్షన్‌కు 20.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌ల సౌకర్యంతో గల ఈ ట్రైన్‌కు మార్గమధ్యలో వారణాసి, ప్రయాగ్‌రాజ్ చోకి, సత్న, మయర్, కట్ని, జబల్‌పూర్, ఇటార్సీ, గోరడోంగ్రి, బెతుల్, నాగ్‌పూర్, సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్హార్షా, సిర్పూర్‌కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య
● కుమారుడి మృతితో తల్లి ఆత్మహత్యాయత్నాయత్నం
● ఆస్పత్రికి తరలింపు
చిట్యాల: పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ముచినిపర్తిలో చోటు చేసుకుంది. కుమారుడి మరణవార్త విన్న తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూపతి సారయ్య, జయలక్ష్మి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు రమ్యకు ఏపీలోని నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన లక్ష్మయ్యతో వివాహం జరిగింది. వారి కుమారుడు నాని(16) ముచినిపర్తి గ్రామంలో తాతయ్య, అమ్మమ్మ( సారయ్య–జయలక్ష్మి) వద్ద ఉంటూ జూకల్ పాఠశాలలో పదోతరగతి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం పాఠశాలకు వెళ్తానని అమ్మమ్మకు చెప్పి వెళ్లకుండా మధ్యలోనే ఇంటికి వచ్చాడు. కాగా, కూలీ పనులు ముగించుకుని జయలక్ష్మి సాయంత్ర ఇంటికి వచ్చింది. తలుపులు తీయగా రాకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే చుట్టపక్కల వారి సాయంతో తలుపులు తొలగించి చూడగా నాని ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది కనిపించడంతో బోరున విలపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థి మృతి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. నాని మరణవార్త తెలియడతో అతడి తల్లి రమ్య నెల్లూరులోని పడుగుపాడు స్వగృహంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు తెలి సింది. కాగా, నాని మృతిగల కారణాలు తెలియాల్సి ఉంది.
సీఏ ఫలితాల్లో సిరిసహస్రకు ఆలిండియా 35వ ర్యాంకు
సీఏ ఫలితాల్లో సిరిసహస్రకు ఆలిండియా 35వ ర్యాంకు
సీఏ ఫలితాల్లో సిరిసహస్రకు ఆలిండియా 35వ ర్యాంకు
Comments
Please login to add a commentAdd a comment