అదే ప్రాంతం.. అక్కడే ప్రమాదం
ప్రజల ఆందోళన
సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ సమీపంలో వరుస ఘటనలు జరిగి యువకులు ప్రాణాలు వదలడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
హసన్‌పర్తి : అదే ప్రాంతం.. అక్కడే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన వడ్డేపల్లి చర్చి–ఉనికిచర్ల ప్రధాన రహదారిలోని సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ వద్ద మంగళవారం జరిగింది. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన తడుగుల రవి(41) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పురుగు మందుల కొనుగోలు నిమిత్తం బైక్‌పై సుబ్బయ్యపల్లికి వచ్చాడు. అనంతరం ఇంటికి ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో మార్గమధ్య సుబ్బయ్యపల్లి సమీపంలోని పంప్‌లో పెట్రోల్ పోసుకుని ముందుకు సాగాడు. అయితే బైక్ అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొని తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై దేవేందర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు భార్య ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు.
అక్కడ ప్రమాదం జరిగితే మృత్యుఒడికే..
వడ్డేపల్లి చర్చి–ఉనికిచర్ల ప్రధాన రహదారిలోని సు బ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ప్రమాదం జరిగితే నేరుగా మృత్యుఒడికి వెళ్లాల్సిందే. ఐదు నెలల్లో ఐదుగురు బైక్ అదుపు తప్పి డివైడర్లకు ఢీకొని అక్కడికక్కడే ప్రాణా లు వదిలారు. సరిగ్గా నెల రోజుల క్రితం ముప్పారం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇదే ప్రాంతంలో బైక్ అదుపు తప్పి మృతి చెందాడు. అలాగే, ధర్మసాగరం మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన మహేశ్ ఇదే ప్రాంతంలో ప్రాణాలు వదిలాడు. మరో ఇద్దరు యువకులు కూడా బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని మృతి చెందారు.
బైక్ అదుపు తప్పి వ్యక్తి దుర్మరణం
సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ వద్ద ఘటన
ఐదు నెలల్లో.. ఐదుగురు మృతి
అదే ప్రాంతం.. అక్కడే ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment